కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపడం కేంద్ర ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్లో ఏపీకి మొండిచేయి చూపిన ప్రతిసారి, సాక్షి పేపర్లో ఛానల్ లో చంద్రబాబు నాయుడు చేతకానితనం వల్లే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మొండిచేయి చూపింది అని రాసేవారు. జగన్ కూడా తన ఉపన్యాసాలలో చంద్రబాబు చేతకానితనం వల్లే కేంద్ర నిధులు రాష్ట్రానికి రావడం లేదంటూ ఆ వ్యాఖ్యలను వల్లె వేసేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. జగన్ కేసుల వల్లే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపింది అని టిడిపి నేత అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే..
నాకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతా అని గతంలో జగన్ పలుమార్లు వ్యాఖ్యలు చేసి ఉన్నారు. దానికి తగ్గట్టే ప్రజలు కూడా 22 మంది ఎంపీలను వైఎస్ఆర్సిపి పార్టీ కి కట్టబెట్టారు. 22 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి బడ్జెట్లో ఏమాత్రం నిధుల కేటాయింపు లేకపోవడం శోచనీయం అంటూ పలువురు విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రాష్ట్ర విభజన సమయంలో వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామని చెప్పిన నిధులతో సహా చాలా వాటి విషయం ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదని నిర్వేదం వ్యక్తం చేశారు. వీటిపై స్పందించిన టిడిపి నేత అచ్చెన్నాయుడు, కేంద్రం మెడలు వంచుతాం అన్న జగన్ మెడ ప్రస్తుతానికి సగానికి వంగిపోయింది అని ఎద్దేవా చేశారు. జగన్ కి తన కేసులను మాఫీ చేయించుకోవడం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదని ఆయన విమర్శించారు.
రాజకీయ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ, 22 మంది ఎంపీలు ఉండి కూడా బడ్జెట్లో కనీస నిధులు కూడా రాబట్ట లేకపోవడం పై సామాన్యులు కూడా పెదవి విరుస్తున్నారు. “అక్కరకు రాని 22 మంది ఎంపీలు” ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్లుగా పరిస్థితి తయారైంది అంటూ వాపోతున్నారు. మరి ముఖ్యమంత్రిగా జగన్ ఈ బడ్జెట్ పై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.