అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాల్సింది కాదు.. కానీ ఓ సామాజికవర్గంపై అందర్నీ రెచ్చగొట్టడంతోనే ఆయన ఓడిపోయారు. జగన్ గెలిచారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ టీం.. పన్నిన వ్యూహమేనని చాలా మంది నమ్మకం. అది నిజమో కాదో కానీ.. ఇప్పుడు.. ఆ పీకేనే… జగన్‌ను గెలిపించినందుకు బాధపడుతున్నారని..ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం పని చేసిన వాళ్లందరూ…. ఓట్లు వేసిన వాళ్లందరూ.. తప్పు చేశామనే ఫీలింగ్‌లో ఉన్నారని చెప్పడానికి.. ఆర్కే.. ఈ విషయాన్ని తన వారాంతాపు ఆర్టికల్ కొత్తపలుకులో చెప్పుకొచ్చారు. అంతే కాదు.. “జగన్మోహన్రెడ్డి పాలన ఇలా ఉంటుందని అనుకోలేదు. నేను చంద్రబాబుకే కాదు- ఆంధ్రప్రదేశ్‌కు కూడా అన్యాయం చేశాను” అని ఆయన ఇప్పుడు తీరిగ్గా వాపోతున్నారని కూడా ఆర్కే చెబుతున్నారు.
కోర్టులను లెక్క చేయని జగన్ విధానం ఎంత ప్రమాదకరమో.. ఆర్కే ఉదాహరణలతో చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో ప్రధానమంత్రిగా ఉన్న పీవీకి కూడా విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేదని గుర్తు చేశారు. పదవిని కారణంగా చూపిస్తూ.. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు అడుగుతున్నారు. దేశ ప్రధానికే లభించని మినహాయింపు.. ఒక ముఖ్యమంత్రికి మాత్రం ఎలా లభిస్తుందనేది ఆర్కే లాజిక్. జగన్మోహన్ రెడ్డి తీరు వల్ల అంతర్జాతీయంగా ఏపీ పరువు ప్రతిష్టలు మసకబారాయని ఆర్కే.. చెప్పుకొచ్చారు. అటు దావోస్‌లోనూ.. ఇటు ఢిల్లీలోనూ ఏపీ గురించి వేసుకుంటున్న జోకుల గురించి ఆర్టికల్‌లో ఆర్కే ప్రస్తావించారు.
జగన్ కక్ష సాధింపు పాలన వల్ల.. ఆంధ్రప్రదేశ్ ఎంత సంపద కోల్పోయిందో.. చిన్న ఉదాహరణతో ఆర్కే చెప్పారు. భీమవరంలో.. టీడీపీ సర్కార్ ఉన్నప్పుడు ఎకరా అరవై లక్షలు ఉన్న భూమి ఇప్పుడు రూ. 30 లక్షలు మాత్రమే ఉందంటున్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అంటే.. రియల్ ఎస్టేట్ అని ఆరోపించిన వారు.. ఇప్పుడు విశాఖలో చేస్తున్నదేమిటని… ఆర్కే ప్రశ్నించారు. ఉచిత పథకాలతో.. ప్రజల్ని బిచ్చగాళ్లను చేస్తున్న వైనంగా…. ఓ పురాణ గాధను కూడా ఆర్కే వివరించారు. మొత్తానికి అమరావతికి మద్దతుగా తన వాయిస్ వినిపించే విషయంలో ఆర్కే.. ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టలేదు. ఈ వారం ఆర్టికల్ ద్వారా అది స్పష్టమయింది.