రోజులు .. వారాలు.. నెలలు గడిచిపోతున్నాయి. కానీ కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ఒక్కటంటే.. ఒక్క రూపాయి రావడం లేదు. ఇప్పుడు బడ్జెట్ కూడా వచ్చింది. ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలివ్వండి.. కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేకహోదా తీసుకొస్తామన్న జగన్మోహన్ రెడ్డి ప్రకటన ప్రజలందరి చెవుల్లో మార్మోగిపోతోంది. ఒక్క ప్రత్యేకహోదానే కాదు.. ఏపీకి రావాల్సిన వాటిని.. పట్టుదలగా ప్రయత్నించి తీసుకొస్తామని… మెడలు వంచైనా సాధిస్తామని గంభీరమైన ప్రకటనలు చేశారు. తీరా అదికారంలోకి వచ్చాక.. సైలెంటయిపోయారు.
మెడలు వంచి తెస్తామన్న ప్రత్యేకహోదా ఇంకా గుర్తుకు రావట్లేదా..?
ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేశారు. చంద్రబాబు ప్రత్యేకహోదా సంజీవని కాదని అన్నారని.. సాక్షి పత్రిక ద్వారా.. మాత్రమే కాదు.. తాను కూడా.. రచ్చ రచ్చ చేశారు. ప్రత్యేకహోదా వస్తే.. ప్రతీ సిటీ హైదరాబాద్ అవుతుందని.. అలాంటి అవకాశాన్ని చంద్రబాబు నేలపాలు చేశారని.. తన పార్టీకి చెందిన ఎంపీల్ని గెలిపిస్తే.. తాను ప్రత్యేకహోదా తీసుకు వస్తానని ప్రకటించారు. కేంద్రంలో ఎల్లయ్య ఉన్నా.. పుల్లయ్య ఉన్నా.. తాను .. మెడలు వంచే విషయంలో లక్ష్య పెట్టబోనని ప్రకటించారు. ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చి.. రాష్ట్రంలో 151 సీట్లతో తిరుగులేని అధికారం ఇచ్చి.. ఎనిమిది నెలలు దాటిపోయింది. ఇంత వరకూ ప్రత్యేక హోదా కోసం.. ఎవరి మెడలు వంచే ప్రయత్నం జరగలేదు.
ఎనిమిది నెలల్లో కేంద్రం నుంచి ఒక్క రూపాయి తేగలిగారా..?
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అయింది. ఇంత వరకూ.. ఏపీకి రావాల్సిన వాటిలో ఒక్కటంటే… ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేకపోయారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం.. గత ప్రభుత్వం రూ. ఐదు వేల కోట్లు ఖర్చు చేసింది. అవి వంద శాతం రీయింబర్స్ చేయాల్సిన బాధ్యత.. కేంద్రంపై ఉంది. ఇది కేంద్రం దయ కాదు. పార్లమెంట్లో చేసిన చట్టం. కానీ ఎనిమిది నెలలుగా… ఆ రూ. ఐదు వేల కోట్లు విడుదల కాలేదు. యూసీలని.. ఓచర్లనీ.. రకరకాల కారణాలతో పెండింగ్లో పెట్టారు. చివరికి రూ. 1800 కోట్లు విడుదల చేస్తున్నామని సమాచారం ఇచ్చారు. రోజుల గడిచిపోతున్నా.. అవి విడుదల కాలేదు. ఇక వెనుకబడిన జిల్లాలకు నిధులు టీడీపీ హయంలోనే… విడుదల చేసి మరీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు.. ఆ నిధుల గురించి. .. వైసీపీ నేతలు అడగను కూడా అడగడం లేదు. ఇక జాతీయ ప్రాజెక్టులు, కేంద్ర విద్యాసంస్థలు సహా.. ఏ ఒక్క దానికి ఏపీ సర్కార్ రూపాయి అదనపు సాయం పొంద లేకపోయింది.
ముఖ్యమంత్రే నడుం వంచేస్తూంటే .. ఇక మెడలేం అందుతాయి..?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి సారి మోడీతో భేటీ అయినప్పుడే… కాళ్లకు నమస్కారం పెట్టేశారు. అప్పుడే ఇచ్చిన వినతి పత్రంలో అమరావతికి నిధులవసరం లేదని చెప్పేశారు. ప్రభుత్వమే వద్దంటే… కేంద్రం ఇస్తుందా..! అప్పట్నుంచి కేంద్రం ఇక ఏపీకి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. నోరు తెరిచి అడగాల్సిన వారు నోరు కట్టేసుకుంటున్నారు. కనిపిస్తే.. కాళ్ల మీద పడిపోతున్నారు. ప్రతీ దానికి మద్దతు పలుకుతున్నారు. ఇదంతా.. వెనుక ఉన్న కేసుల లగేజీ భయం కావొచ్చు. కానీ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం మత్రం.. ఆమోదయోగ్యం కాదు. ఎన్నెన్ని చెప్పి .. ఓట్లు వేయించుకున్నారో… వాటికి భిన్నంగా వెళ్లడం ప్రజాగ్రహానికి దారి తీస్తుంది.
మించిపోయింది లేదు.. పోరాడితే పోయేదేం లేదు..!
ఏపీ ముఖ్యమంత్రి ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్ అనడం మానేసి.. కార్యక్షేత్రంలోకి దిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. మెడలు వంచుతామని చేసిన గంభీరమైన ప్రకటనలకు కాస్తంతయినా సార్థకత తెచ్చే ప్రయత్నం చేయాలి. పోరాడితే పోయేదేం ఉండదని గుర్తించాలి.