2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ పేరుతో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్రమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. రైల్వే బోర్డుతో చర్చించి.. మిగతా కార్కక్రమాలు పూర్తి చేసి.. నాలుగైదు నెలల్లో… జోన్ ఉనికిలోకి తెస్తామని చెప్పారు. ఇప్పటికి దాదాపుగా సంవత్సరం అయింది. రైల్వేజోన్‌కు సంబంధించి ఆ ప్రకటనే తప్ప.. ఇంత వరకూ ఒక్క అడుగు కూడా మందుకు పడలేదు. అప్పట్లో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ నేతలు తమ పోరాటం వల్లే వచ్చిందన్నారు. పీయూష్ గోయల్ ప్రకటించిన జోన్లో.. వాల్తేరు రైల్వే డివిజన్ లేదు.
ఈ డివిజన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటూ ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్‌లోని భాగాలను కవర్ చేస్తుంది. దీన్ని కూడా… సౌత్ కోస్ట్ జోన్లో ఉంచాలనే డిమాండ్లు వచ్చాయి. అవి రాజకీయ డిమాండ్లుగానే ఉండిపోయాయి. అసలు జోన్‌కే ఇప్పుడు ఎసరు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. రైల్వే బడ్జెట్లో జోన్ గురించి ప్రస్తావనే లేదు. నిజానికి అన్ని వివరాలు పరిశీలించి.. సమగ్రంగా నివేదిక అందిన తర్వాతే కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. జోన్ ఏర్పాటు ప్రకటన చేసి ఉంటారు. కానీ.. అది ఎన్నికల కోసం చేసిన ప్రకటన అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
రైల్వేజోన్ ఏర్పాటుకు కొన్ని మౌలిక సదుపాయాలు అవసరం వాటి కోసం.. బడ్జెట్లో నిధులు కేటాయిస్తారేమోనని ఎదురు చూశారు. కానీ నిరాశే ఎదురయింది. ఇప్పుడు… అసలు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉందా లేదా.. అన్నదానిపై అక్కడి ప్రజలకే క్లారిటీ లేకుండా పోయింది. ప్రజల్ని బకరాలు చేసి రాజకీయ పార్టీలు… ఇలా సెంటిమెంట్లతో ఆడుకుంటున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చేతిలోకి వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో… ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలం అవుతోందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.