త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. దేశ రాజధానిలో గెలవాలన్న పట్టుదలతో భాజపా ఉంది. అందుకే, ప్రచారం కూడా భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజపా నేతలు కూడా అక్కడికి ప్రచారానికి వెళ్లారు. ఢిల్లీలో స్థిరపడ్డ తెలుగువారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఢిల్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శల్నే ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు! ఈ సందర్భంగా తెలుగువారితో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కూడా పెట్టారు. ఢిల్లీలో ఉంటున్న తెలుగువారిని పెద్ద సంఖ్యలో ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని తాము ఎప్పుడూ హామీ ఇవ్వలేదన్నారు. రాష్ట్ర పథకాలకు కేంద్ర బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయిస్తుందన్నారు! కాళేశ్వరం, మిషన్ భగీరథ, రైతుబంధులకు కేంద్రం డబ్బులివ్వలేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రాల పేరుతో కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉండవని కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేసుకోవాలనీ, అలాగే కేంద్రం కూడా వివిధ మంత్రిత్వ శాఖల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేస్తుందన్నారు. దాన్లో భాగంగా రాష్ట్రాల అవసరాలు తీరుతాయనీ, అంతేగానీ ప్రత్యేకంగా కేటాయింపులు అంటూ ఏవీ ఉండవన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా కేంద్ర పథకాలు అమలౌతున్నాయన్నారు కిషన్ రెడ్డి. ఢిల్లీలో ప్రభుత్వ మారబోతోందనీ, ఆ మార్పును తాను ప్రచారంలో భాగంగా గమనిస్తున్నాననీ, ఆప్ పోవాలీ భాజపా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు. ఢిల్లీలో తెలుగు ఓటర్లు ఈసారి కీలకం కాబోతున్నారని రామ్ మాధవ్ చెప్పారు.
ఢిల్లీలో స్థిరపడ్డవారిని ఆకర్షించడానికి తెలంగాణ అంశాలనే ఎక్కువగా మాట్లాడుతున్నారు భాజపా నేతలు! అక్కడి తెలుగువారికి చెప్పేందుకు వేరే అంశాలే లేవా? ఢిల్లీలో స్థిరపడ్డవారు ఎవరైనా… అక్కడి స్థానిక అంశాల ఆధారంగానే కదా ఎన్నికల్లో ఓటు వేసేది..? అక్కడ కూడా తెరాస పోటీలో ఉన్నట్టుగా టి.భాజపా నేతలు మాట్లాడటం వల్ల ప్రయోజనం ఎంతవరకూ ఉంటుందో వారికే తెలియాలి.