పవన్ కల్యాణ్ మళ్లీ షూటింగ్ ప్రారంభించారు. ఒకటి కాదు.. వరుసగా మూడు సినిమాల షూటింగ్‌లు ప్రారంభించారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే.. రాజకీయ నేతగా మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా చేయాలనేది ఫ్యాన్స్ కోరిక. దాన్ని పవన్ కల్యాణ్ ఇప్పుడు నిజం చేస్తున్నారు. తీవ్రమైన తర్జనభర్జనల తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లో నటించాలనే నిర్ణయం తీసుకున్నారు. అమల్లో పెట్టారు.
పవర్ స్టార్ నటిస్తే విమర్శలెందుకు..?
పవన్ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత జనసేన నుంచే …మొదటి రియాక్షన్ వచ్చింది. జనసేన పార్టీ కీలక నేతగా ఉన్న వీవీ లక్ష్మినారాయణ పార్టీకి రాజీనామా చేశారు. దానికి లక్ష్మినారాయణ చెప్పిన కారణం… పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడం. సినిమాల్లో నటించబోనని… పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటానని చెప్పి.. ఇప్పుడు.. మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారని.. దీన్ని బట్టి చూస్తే.. పవన్ కల్యాణ్‌కు నిలకడ లేదని తెలుస్తోందని.. లక్ష్మినారాయణ అభిప్రాయం. పవన్ కల్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోవడంపై.. ఇతర పార్టీల నేతలు ఎలాంటి విమర్శలు చేసినప్పటికీ.. సొంత పార్టీకి చెందిన ఓ కీలక నేత వ్యతిరేకించడం… చర్చనీయాంశం అవుతుంది. అదే జరిగింది.
రాజకీయాల్లోకి వస్తే నటించకూడదనే రూల్ ఉందా..?
జనసేన పార్టీకి రాజీనామా చేయడానికి లక్ష్మినారాయణ చెప్పిన కారణం మాత్రం … చాలా మందికి అతిశయోక్తిగానే అనిపించింది. చివరికి లక్ష్మినారాయణకు సన్నిహితులైన ప్రముఖులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉన్న హీరో కాబట్టి ఆయన సినిమాల్లో నటిస్తే డబ్బులు వస్తాయని సక్రమ మార్గంలో ఆదాయాన్ని ఆర్జించడం తప్పేం కాదని… జయప్రకాష్ నారాయణ తేల్చి చెప్పారు. నిజాయితీగా గౌరవప్రదంగా సంపాదించుకుంటున్నప్పుడు ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన పనిలేదన్నారు. పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా ద్వేషించే కొంత మంది నేతలవి తప్ప… దాదాపుగా అందరి అభిప్రాయం పాజిటివ్‌గానే ఉంది. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించారు.
రాజకీయ ద్వేషులు తప్ప అందరూ స్వాగతిస్తున్నవారే..!
ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు…. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఏ ఒక్కరు కూడా… నటనను మర్చిపోలేదు. తాము ఎక్కడి నుంచి వచ్చామో గుర్తు పెట్టుకున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా నటిస్తూనే ఉన్నారు. నాటి తరంలో ఎన్టీఆర్ తో ప్రారంభించి.. ఎమ్జీఆర్.. నేటి తరంలో బాలకృష్ణ, శరత్ కుమార్, కమలహాసన్.. ఇలా చెప్పుకుంటూ.. పోతే..రాజకీయ రంగంలో ఉన్న ప్రతి ఒక్క నటుడూ … తన వృత్తిని కొనసాగిస్తున్నారు. వారిని ఎవరూ నటించవద్దని అనడం లేదు. అలా అనడం కూడా కరెక్ట్ కాదని.. మెజార్టీ అభిప్రాయం.వివిధ రాజకీయ పార్టీల నేతలకు ఉండే పరిమితుల వల్ల స్పందించలేకపోవచ్చు కానీ..పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.