ఈ పండగ సందడి అంతా దిల్ రాజుదే. సంక్రాంతి కి నాలుగు సినిమాలు వచ్చాయి. వాటితో ప్రత్యక్షo గానో, పరోక్షం గానో దిల్ రాజుకి సంబంధం వుంది. ఐతే ఈ పండక్కి వచ్చిన సినిమాల్లో రెండు సినిమాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆల్ టైమ్ హిట్టు మాదంటే, మాది అంటూ పోటా పోటీ గా పోస్టర్లు వెసుకున్నాయి. ఇందులో ఎవరిది నమ్మాలో తెలియక అంతా తికమకపడ్డారు. పండగ ఐపోయాక… పండగ సినిమాల హడావుడి తగ్గాక, ఈ ఆల్ టైమ్ హిట్స్ పై.. దిల్ రాజు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
వసూళ్ల లెక్కలో కాస్త తికమక వుంది, కొంత మంది జి. యస్.టీ కలుపుకుని చెపుతున్నారు, కొంతమంది తీసేసి చెపుతున్నారు. అందుకే.. సరైన లెక్కలు రావడం లేదు. కాకపోతే.. ఇద్దరు హీరోల కెరియర్ లో ఇవే పెద్ద సినిమాలు. వాళ్ళ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్లు. కొన్ని ఏరియాల్లో బాహుబలి 1 ని ఓ సినిమా బీట్ చేస్తే, ఇంకొన్ని ఏరియాల్లో బాహుబలి 2 ని మరో సినిమా బీట్ చేసింది – అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. కానీ ఎవరిది అసలైన ఆల్ టైమ్ హిట్టో చెప్పలేదు. ఈ రెండు సినిమాలని పంపిణీ చేసిన ఆయనే.. ఎవరిది సరైన అంకెలో చెప్పలేక పోతున్నారు అంటే.. మిగిలిన వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించండి.