చిత్రసీమలో అవకాశం ఎప్పుడు ఎలా ఎందుకు తలుపుతడుతుందో అస్సలు చెప్పలేం. ఫమ్లో ఉన్నవాళ్లు సడన్‌గా మాయమైపోతారు. అప్పుడెప్పుడో మయమైపోయిన వాళ్లు.. సడన్‌గా తెరపైకొచ్చేస్తుంటారు. దాన్నే `సినిమాటిక్ లక్` అంటుంటారు. అది ఉంటే తిమ్మి బమ్మిలా అయిపోతుంది. లేదంటే ఓడలు బళ్లుగా మరిపోతుంటాయి. చిత్రసీమలో కొంతమంది ఫేడవుట్ భామలకు అదృష్టం కలిసొచ్చింది. తెలుగు తెర అలాంటి వాళ్లని వెదుక్కుని వెళ్లి మరీ… హారతులు పట్టి ఆహ్వానిస్తోంది. దాంతో.. పాత బంగారాలు మళ్లీ మెరుస్తున్నాయి.
త్రిష, ప్రియమణి, శ్రుతిహాసన్, అమలాపాల్…. వీళ్లంతా తెలుగు చిత్రసీమ మర్చిపోయిన కథానాయికలే. త్రిష మరీ వెటరన్ అయిపోయింది. ప్రియమణి బుల్లి తెరకు పరిమితమైపోయింది. అమలాపాల్ ట్విట్టర్లతో తప్ప ఇంకెక్కడా కనిపించడం లేదు. శ్రుతిహాసన్ సరే సరి. తెలుగులో వీళ్లకు మళ్లీ అవకాశం వస్తుందని ఎవ్వరూ కల్లో కూడా అనుకోలేదు. అంతెందుకు.. ఈ హీరోయిన్లే.. తెలుగు సినిమాపై ఆశలు వదిలేసుకుని ఉండి ఉంటారు. అలాంటి వాళ్లకు మళ్లీ ఛాన్సులు వరించాయి.
త్రిష చిరంజీవి పక్కన సెటిలైపోయింది. శ్రుతిహాసన్ రవితేజతో ఓ సినిమా చేస్తోంది. ప్రియమణి, అమలాపాల్ ఇద్దరూ… వెంకీ సినిమాలో ఛాన్సులు అందేసుకున్నారు. ఇవన్నీ చిన్న చితకా చిత్రాలు కావు. పరిశ్ర దృష్టి ఈ సినిమాలపై, కాంబినేషన్లపై ఉంది. చిరంజీవి – కొరటాల శివ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల. చిరంజీవి స్థాయే వేరు. వీళ్లద్దిరి సినిమా అనగానే స్టార్ హీరోయిన్లు పరుగెట్టుకుని రావాలి. అయితే… కొరటాల మాత్రం త్రిషని ఎంచుకున్నాడు. చిరు – త్రిష జోడీని ‘స్టాలిన్’లో చూశాం. చిరంజీవి పక్కన త్రిష ని చూడడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. అయినా సరే, త్రిషని ఏరి కోరి ఎంచుకున్నారంటే ఏదో ఓ బలమైన కారణం ఉండే ఉంటుంది.
రవితేజ నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈసినిమాలో శ్రుతి నాయిక. ఇది వరకు ఈకాంబినేషన్లోనే బలుపు వచ్చింది. ఆ సినిమా హిట్టు. ఆ సెంటిమెంట్‌తోనే… శ్రుతిని ఎంచుకుని ఉండొచ్చు. ఇక అసురన్ రీమేక్ గా వస్తున్న ‘నారప్ప’లో ప్రియమణి, అమలాపాల్ నటిస్తున్నారు. వయసైపోతోంది, ఫేడవుట్ అయిపోతోంది అనుకుంటున్నాంగానీ, ప్రియమణిలో మంచి నటి దాగుంది. తను జాతీయ ఉత్తమ నటి పురస్కార గ్రహీత. ప్రియమణి లోని నటిని నమ్మే… శ్రీకాంత్ అడ్డాల ఆమెకు ఈ ఆఫర్ ఇచ్చి ఉంటాడు. అమలాపాల్ కీ ప్రాధాన్యం ఉన్న పాత్రే దక్కింది. `విరాటపర్వం`లోనూ ప్రియమణి కీలక పాత్ర లో నటిస్తోంది.
ఈ వెటరన్ భామలకు వెల్కమ్ చెప్పడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. అదేంటంటే… సీనియర్ హీరోలకు సమానమైన స్థాయి, అనుభవం ఉన్న కథానాయికలు దొరకడం లేదు. స్టార్ హీరోయిన్లు పారితోషికం పేరుతో భయపెట్టడం, అందుబాటులో కథానాయికలు లేకపోవడంతో, మన దర్శకులు మళ్లీ వెనక్కి వెళ్లి, వెటరన్లను తెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలు, వీళ్లలో ఎవరి జాతకాన్ని ఎలా మారుస్తాయో, ఎవరిని మళ్లీ ఫామ్ లోకి తీసుకొస్తాయో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి.