దిల్‌రాజు… ఓ అగ్ర నిర్మాత. పరిశ్రమ మొత్తానికి ఆయన మాటంటే గురి. ఓ రకంగా పరిశ్రమని శాశించే వ్యక్తుల్లో దిల్ రాజు పేరు మొదటి వరుసలో ఉంటుంది. అగ్ర దర్శకులు సైతం.. ఆయన మాటకి ‘నో’ చెప్పే ఛాన్స్ లేదు. అయితే.. ఓ కొత్త దర్శకుడు మాత్రం దిల్ రాజు మాటకి నో చెప్పాడు. ఆయన చెప్పిన సలహాలూ సూచనలు పెడ చెవిన పెట్టాడు. తాను అనుకున్నదే తీశాడు. ఈ విషయాన్ని దిల్ రాజు సైతం మీడియా ముందు ప్రస్తావించడం విశేషం.
దిల్ రాజు నిర్మాతగా రూపుదిద్దుకున్న సినిమా ‘జానూ’. తమిళ 96కి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమాని దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ కే తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. అయితే తమిళ సినిమాకీ తెలుగు సినిమాకీ కొన్ని మార్పులు, చేర్పులూ ఉండాలని దిల్ రాజు భావించాడు. ఓ పేపర్ పై అవన్నీ రాసి, దర్శకుడి ముందు పెట్టాడు కూడా. కానీ… దర్శకుడు వాటిని పట్టించుకోలేదు. తాను ఏదైతే అనుకున్నాడో అదే తీశాడు. ఈ విషయాన్ని దిల్ రాజు ఒప్పుకున్నారు. ”నేను కొన్ని మార్పులు చెప్పాను. అయితే అవేమీ ప్రేమ్ పట్టించుకోలేదు. తన మనసులో ఈ కథని ఎలా తీయాలనుకున్నాడో అలానే తీశాడు. కేవలం తెలుగు నేటివిటీకి సంబంధించిన మార్పులే జరిగాయి. తమిళంలో విజయ్ సేతుపతి పాత్ర చాలా సైలెంట్‌గా ఉంటుంది. తక్కువ మాట్లాడతాడు. కానీ.. శర్వానంద్ పాత్ర దాంతో పోలిస్తే కాస్త హుషారుగా ఉంటుంది. నేను చెప్పిన మార్పులు చేయలేదని ఎలాంటి కంప్లైంట్ లేదు. చివరికి ప్రేమ్ నాకు నచ్చిన సినిమానే తీశాడ”న్నారు. అయితే ఈ ప్రేమ్ ఎవరో కాదు.. ఇది వరకు తొలి అవకాశం దిల్ రాజు బ్యానర్‌లోనే వచ్చింది. ‘ఆర్య’ సినిమాకి ప్రేమ్ కుమార్ అసిస్టెంట్ కెమెరామెన్‌గా పని చేశాడట.