కేంద్రం వెనుకబడిన జిల్లాల కోసం కేటాయించే మెడికల్ కాలేజీల కోసం.. మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి.. కేంద్రమే అడ్డుపుల్ల వేసింది. జనాభా లెక్కలను సేకరించనున్న కారణంగా.. వచ్చే ఏడాది మార్చి వరకూ.. జిల్లాల సరిహద్దులను మార్చవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఒక్క ఏపీ ప్రభుత్వానికే కాదు.. దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు.. ఈ ఆదేశాలు పంపింది. వికేంద్రీకరణ బిల్లులను ఆమోదించుకునేందుకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో… కొన్ని ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. చినజీయర్ ట్రస్ట్ కు 40 ఎకరాలు కేటాయించడం.. గురజాల, అరకు, మచిలీపట్నం జిల్లాలను ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది. కానీ అధికారికంగా ప్రకటన చేయలేదు.
కేంద్ర ప్రభుత్వం విధానం మేరకు… దేశంలోని ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ ఉండాలి. అదే సమయంలో.. మొదటగా వెనుకబడిన జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏపీ సర్కార్ కొత్తగా పంపే ప్రతిపాదనలన్నింటినీ… కేంద్రం పక్కన పెడుతోంది. దీంతో.. వెనుకబడిన ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే… మెడికల్ కాలేజీలు మంజూరవుతాయని అంచనా వేసి.. ఆ మేరకు కేబినెట్ తీర్మానం చేసింది. కానీ… మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయడంలో విఫలం కావడంతో.. ఈ లోపు కేంద్రం.. నంచి జనాభా లెక్కల ఆదేశాలు వచ్చేశాయి. పేరుకు జనాభా లెక్కలు కానీ… సేకరించేది మాత్రం.. జాతీయ పౌర రిజిస్ట్రీ లెక్కలని చెబుతున్నారు.
దీన్ని కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం ఆదేశాలను జవదాటే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొత్త జిల్లాల గురించి మాట్లాడుతున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇరవై ఐదు జిల్లాలు చేస్తామన్నారు. కానీ ప్రతీసారి ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. చివరికీ కనీసం మూడు జిల్లాలు ఏర్పాటు చేద్దామన్నా… మరో ఏడాదిన్నర వరకూ ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.