ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం ప్రవేశ బడ్జెట్‌పై ఇంత వరకూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ముఖ్యంగా బీజేపీయేతర ముఖ్యమంత్రులందరూ.. తమ తమ అభిప్రాయాలు గట్టిగానే వ్యక్తం చేశారు. తమ రాష్ట్రానికి మేలు జరిగిందో.. నష్టం జరిగిందో… చెప్పారు. ఏపీ సీఎం ఆప్తుడు… తెలంగాణ సీఎం కేసీఆర్… దాదాపుగా ప్రతీ రోజూ విమర్శలు చేస్తున్నారు. బడ్జెట్ రోజే తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ బడ్జెట్ ప్రస్తావన తెస్తూ.. కేంద్రానిది చేతకాని తనమని విమర్శిస్తున్నారని… మీడియాలో వస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఎలాంటి ప్రకటనా చేయలేదు. సంతృప్తి కానీ.. అసంతృప్తి కానీ వ్యక్తం చేయలేదు.
బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజున.. ఆర్థిక మంత్రి బుగ్గన మాత్రం ప్రెస్ మీట్… పెట్టి… దేశ స్థాయిలో బాగుందని.. రాష్ట్ర స్థాయిలో బాగో లేదని.. రెండు రకాల అభిప్రాయాలు చెప్పారు. అంతే.. ప్రభుత్వం ఆ తర్వాత సైలెంటయిపోయింది. నిజానికి ఆర్థికంగా.. తీవ్ర ఇక్కట్లలో ఉన్న ఏపీకి .. కేంద్రం ఆశించినంతగా సాయం చేయలేదు. వాస్తవంగా అయితే.. అసలు ఎలాంటి సాయమూ చేయలేదు. గతంలో కేంద్రం మంజూరు చేసిన కేంద్ర విద్యాసంస్థలకూ నిధులు కేటాయింపులు లేవు. రూపాయి కూడా కేటాయించకుండా… వాటి నిర్మాణాలు ఎలా కొనసాగిస్తారో.. ఎలా నిర్వహిస్తారో.. చాలా మందికి అర్థం కాని పరిస్థితి. మరో వైపు రాష్ట్రాల పన్నుల్లో వాటా కోతకు గురయింది.
ఇస్తామన్న జీఎస్టీ పరిహారం కూడా అంతంతమాత్రంగానే ఇస్తున్నారు. అంతిమంగా చూస్తే.. ఏపీసర్కార్ ను మరింతగా ఇరకాటంలోకి నెట్టేసింది బడ్జెట్. కానీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం… అది ప్రాధాన్యతాంశం కాదన్నట్లుగా ఉండటం… ఆర్ధిక నిపుణుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. బడ్జెట్ పై స్పందన వ్యక్తం చేయడం.. కనీస బాధ్యతని అంటున్నారు. నిధుల విషయంలో…కేంద్రంపై ఒత్తిడి రావాలంటే… ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ ఆయన నోరు తెరవడం లేదు. ఇలా ఉండటం వల్ల… ఆయనపై ఉన్న కేసుల వల్లే.. జగన్ నోరు తెరవడం లేదని… ఆయన ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శలు చేయడానికి విపక్షాలకు అవకాశం లభిస్తోంది.