విజిలెన్స్, ఎంక్వయిరీస్ కమిషనర్ ఆఫీసుల్ని… కర్నూలుకు తరలించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరవై ఆరో తేదీ వరకూ.. ఎలాంటి తరలింపు చేపట్టవద్దని తాము ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. ఎందుకు తరలించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అయితే .. నిర్వహణ సౌలభ్యం కోసమే.. తరలిస్తున్నట్లుగా … ఏజీ కోర్టు ఎదుట వాదించారు. అలా అయితే.. చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాల్లో… పెట్టుకోవచ్చని… కర్నూలు వరకు ఎందుకని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశింది. ప్రభుత్వం.. కార్యాలయాల తరలింపుపై సహేతుకమైన కారణం చెప్పకపోతే.. కోర్టు ధిక్కరణ అయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా అధికారులు ఈ విషయంలో… ఇరుక్కుపోయే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. చట్ట రూపంలోకి వికేంద్రీకరణ బిల్లు అయ్యే వరకూ.. ఎలాంటి తరలింపులు వద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అలా తరలిస్తే.. అయిన ఖర్చును అధికారుల నుంచి రాబడతామని హెచ్చరించింది. ఇప్పుడు… కర్నూలుకు కార్యాలయాల తరలింపు ఉత్తర్వులు ఇవ్వడంతో.. రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. కోర్టును కూడా లెక్క చేయనట్లుగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉండటంతో… ఇప్పటికే అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటున్నారు. చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించాలని.. అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తూండటంతో.. ఏం చేయాలో.. తెలియక వారు ఇబ్బంది పడుతున్నారు.
చెప్పినట్లుగా జీవోలు ఇవ్వకపోతే… ప్రభుత్వం చేతిలో అవమానానికి గురవ్వాల్సి వస్తోంది. ఇస్తే.. కోర్టు కేసులు పడే ప్రమాదం ఏర్పడింది. దీంతో… పలువురు సివిల్ సర్వీస్ అధికారులు నలిగిపోతున్నారు. పలువురు రైతులు వేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారణ జరపనుంది.