రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఈమధ్య సరైన పాటలు రాలేదు. ఆయన హిట్ సినిమాల్లో పాలు పంచుకుంటున్నారంతే. మహర్షి లో పాటలు, సరిలేరు నీకెవ్వరు ఆడియో బాగానే ఉన్నా, దేవిశ్రీ తనదైన శైలిలో ఊపేసింది లేదు. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలేవీ దేవిశ్రీ చేయలేకపోయాడు. తక్కువ సమయంలో ఆల్బమ్ పూర్తి చేయాల్సిరావడమో, పని ఒత్తిడో, తనకు తాను రొటీన్ అయిపోయాడో తెలీదు గానీ, దేవీ మార్క్ మిస్సయ్యిందన్నది నిజం. ఇదే సమయంలో తమన్ రెచ్చిపోవడం మొదలెట్టారు. వరుసగా చార్ట్ బస్టర్స్ ఇస్తున్నాడు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరుకి మధ్య అసలు సిసలైన తేడా.. సంగీతమే. ‘సామజవరగమన’ అనే హిట్ గీతం బన్నీ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అలాంటి పాట.. సరిలేరులో మిస్సయ్యింది.
అయితే ఇప్పుడు దేవిశ్రీ మళ్లీ ఫామ్లోకి వచ్చేశాడట. `ఉప్పెన` పాటలతో. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడదిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. దీనికి దేవినే సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ సినిమా అనగానే దేవిశ్రీ ఎలెర్ట్ అయిపోతాడు. ‘కుమారి 21 ఎఫ్’కి కూడా దేవి అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. ఈసారీ దేవి రెచ్చిపోయాడట. తనదైన మార్క్ సంగీతాన్ని ఈ సినిమాలో వినిపించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే పాటలు విన్నవాళ్లు.. ‘ఇదో మ్యూజికల్ హిట్టవ్వడం ఖాయం’ అని కితాబిస్తున్నారు. రేపు ఉదయం తొలి పాట విడుదల అవుతోంది. ఈ పాటతోనే ‘ఉప్పెన’ ప్రమోషన్లూ ప్రారంభం కానున్నాయి. ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా వుందని, ఈ పాటతో ఈ సినిమాపై ఓ హైప్ క్రియేట్ అవ్వడం ఖాయమని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. దేవిశ్రీ ప్రసాద్ రెచ్చిపోయాడంటే… సంగీత ప్రియులకు పండగ ఇక.