అమరావతి రాజధాని అంశంలో కేంద్రం చెప్పిందానికి.. రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నదానికి పొంతన లేకుండా పోయింది. ఎవరికి నచ్చిన అర్థం వారు తీసుకుంటున్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కావాలనే గందరగోళంగా.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో సమస్య మరింత జఠినం అయింది.
2015లోనే రాజధానిని నోటిఫై చేశారన్న కేంద్రం..!
పార్లమెంట్లో గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి క్లుప్తంగానే సమాధానం ఇచ్చారు. దాని ప్రకారం.. 2015లో రాజధానిగా అమరావతి నోటిఫై అయిపోయింది. దీన్ని తెలుగుదేశం పార్టీతో పాటు అమరావతి మద్దతుదారులు హైలెట్ చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని గుర్తించారని.. ఇప్పుడు తరలించాడనికి అవకాశం లేదని అంటోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమాధానం చెంపపెట్టు అని టీడీపీ వర్గాలు అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి. ఒక సారి నోటిఫై అయిన రాజధానిని మార్చే హక్కు లేదని.. కేంద్రం తన లేఖ ద్వారా చెప్పిందని అంటున్నాయి.
రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనని మరో పాయింట్..!
రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని.. అంతా తమ ఇష్టమని.. వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు… కేంద్రం ఇచ్చిన సమాధానంలో అది కూడా ఉంది. మూడు రాజధానుల గురించి మీడియాలో వింటున్నామని కానీ… తమ వద్దకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. రాజధానులపై రాష్ట్రాలదే నిర్ణయమని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంలో ఉంది. దీన్ని పట్టుకుని తమకు వైసీపీ నేతలు.. ఇక తమకు ఎదురులేదని చెబుతున్నారు. తాము మూడు రాజధానులను పెట్టి తీరుతామంటున్నారు. తమ విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు.
కేంద్రం ఎందుకీ గందరగోళం సృష్టిస్తోంది..?
రాజధానులు అనేది రాష్ట్రం ఇష్టమే. అసలు రాజధాని అనే సమస్య ఏ రాష్ట్రానికి రాదు. రాజధాని లేకుండా విడిపోయిన ఏపీకి మాత్రమే ఈ సమస్య వచ్చింది. రాష్ట్రం ఇష్టం కాబట్టే.. రాజధాని ఎంపిక చేసుకునే అవకాశం గత ప్రభుత్వానికి వచ్చింది. అమరావతిని ఎంపిక చేసింది. దాంతో ఆ ఎపిసోడ్ అయిపోయింది. మళ్లీ ..మళ్లీ రాజధాని ఎక్కడ అనే ప్రశ్న రాకూడదు. రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్రానికి ఉంది. కానీ.. నిర్ణయం అయిపోయి.. రూ పది వేల కోట్లు ఖర్చు చేసిన రాజధానిని నిర్వీర్యం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అన్నట్లుగా కేంద్రం సమాధానం ఇచ్చింది. దీంతో సమస్య మరింత జఠిలం అయింది.