అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టిస్తోంది. ఒక్క ఆర్థిక సంవత్సరం.. అదీ కూడా.. పది నెలల కాలంలోనే ఏకంగా రూ. 47,100 కోట్లు అప్పు చేసింది. మరో రెండు నెలల కాలంలో మరో రూ. పది వేల కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తోంది. ఎలా చూసినా.. ఒక్క ఏడాదిలో అప్పు యాభై వేల కోట్లకుపైగానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సర్కార్.. ఐదేళ్లలో చేసిన అప్పు… రూ. లక్షా ఇరవై వేల కోట్లు మాత్రమే. కానీ ఈ ప్రభుత్వం.. రెండేళ్లలోనే టీడీపీ అప్పుల రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుల కోసం నిబంధనలను సైతం… ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాలు.. అప్పులు తెచ్చుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం.. జీఎస్డీపీ … అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌లో అధికారికంగా 25 శాతం వరకు రుణాలు తీసుకునే అవకాశముంది. పరిమితికి మించి రుణాలు తీసుకుంటే ఆర్థికంగా ఆంక్షలు విధిస్తాయి. అయితే.. ఏపీ సర్కార్.. వీటిని పట్టించుకోవడం లేదు. ఎక్కడా… అప్పు దొరికితే.. అక్కడ నుంచి నిధులు స్వీకరిస్తోంది. వడ్డీ… ఎంత అనేదాన్ని కూడా లెక్క చేయడం లేదు. ఇలా జీఎస్డీపీలో ఏపీ 31.6 శాతాన్ని అప్పులుగా ఏపీ సర్కార్ తీసుకొచ్చింది. ఇది తగ్గిపోతున్న రుణ సామర్థ్యానికి ప్రతీకగా ఉంటుంది. దీని వల్ల భవిష్యత్‌లో కొత్త అప్పులు తెచ్చుకోవాలంటే.. తంటాలు పడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేట తిరోగమనంలో ఉంది. సగానికి పడిపోయిన సర్కార్ ఆదాయమే దీనికి సాక్ష్యంగా కనిపిస్తోంది. ప్రజల వద్ద సొమ్ములు లేకవడంతో.. వారి కొనుగోలు శక్తి క్షీణించింది. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో.. మనీ సర్క్యూలేషన్ కూడా నిలిచిపోయింది. ఫలితంగా… ఈ ఏడాది జీఎస్డీపీ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే.. కొత్త అప్పులు.. పుట్టే అవకాశం ఉండదు. ఇది ఏపీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.