వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం స్లో అయింది కానీ.. ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలన్నదానిపై మాత్రం… అనేక ఆలోచనలు చేస్తున్నారు. రాయలసీమకు నీటిని తరలించడానికి.. మొదటగా ఆయన తెలంగాణ సర్కార్‌తో కలిసి..ఉమ్మడి ప్రాజెక్టు కట్టాలనుకున్నారు. కేసీఆర్ నీళ్లిస్తామన్నారని.. క్టటి తీరుతామని స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. కానీ.. తర్వాత మాట మార్చేశారు. ఉమ్మడి ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా.. పల్నాడులోని బానకచర్ల వద్ద… రిజర్వాయర్ నిర్మించి.. సీమకు నీళ్లు తరలించాలనే ప్రతిపాదన పెట్టారు. దీనికి కూడా… రూ. 70, 80 వేల కోట్ల ఖర్చవుతుందని అంచనా. దీనిపై కొన్ని సంస్థలకు నివేదిక ఇచ్చే బాధ్యతలు అప్పగించారు.
ఈ పని జరుగుతూండగానే.. తాజాగా ముఖ్యమంత్రి మరో ప్రతిపాదన అధికారుల ముందు పెట్టారు. అదేమిటంటే.. ఈ బానకచర్ల కాదు కానీ.. పోలవరం నుంచి గోదావరి నీటిని తొలుత పులిచింతలకు, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు రివర్స్ పంపింగు చేసే దిశగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి జలాలను బొల్లాపల్లి జలాశయం మీదుగా బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలించాలన్న ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా దీన్ని పరిశీలించాలని చెప్పారు. గతంలో బానకచర్ల ప్రాజెక్ట్ కోసం.. ఐదారుసార్లు రివ్యూ చేసి.. కట్టేద్దామని హడావుడి చేసిన జగన్.. ఒక్క సారిగా ప్రత్యామ్నాయం ఎందుకు ఆలోచన చేస్తున్నారో అధికారులకు కూడా అర్థం కాలేదు.
అయితే.. కొద్ది రోజుల కిందట… తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన తర్వాతే… జగన్ మాటల్లో మార్పు వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి ఉమ్మడి ప్రాజెక్టు విషయంలోనూ… ఈ రివర్స్ పంపింగ్.. ప్రధాన అంశం. బానకచర్ల ద్వారా పెన్నా అనుసంధానం చేస్తే.. రివర్స్ పంపింగ్ అవసరం రాదని జనవనరుల నిపుణులు చెబుతున్నారు. కానీ.. కొత్త ప్రతిపాదన ద్వారా మాత్రం.. రివర్స్ పంపింగ్ చేయాలి. ఈ ఆలోచన లోగుట్టేమిటో మాత్రం.. ముందు ముందు తీసుకునే నిర్ణయాల ద్వారా బయటపడే అవకాశం ఉంది.