ప్రత్యేకహోదా గురించి మాట్లాడితే… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇబ్బంది పడతారని.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ.. జగన్మోహన్ రెడ్డి..ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసిన విషయం మీడియాలో హైలెట్ అయింది. దీనిపై జీవీఎల్ ఆవేశపడ్డారు. ప్రత్యేకహోదా అనేది అంతరించిపోయిన వ్యవస్థ అన్నారు. గత టీడీపీ లాగే.. బీజేపీపై హోదా పేరుతో నిందలు వేయడానికి ప్రయత్నిస్తే.. జగన్ .. టీడీపీ ఎదుర్కొన్న పరిణామాలనే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లేని వ్యవస్థ కోసం మాట్లాడితే..జగన్ రాజకీయంగా ఇబ్బంది పడతారన్నారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని జగన్‌కి కూడా తెలుసని అయినా.. లేఖలు రాస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాను పునరుద్ధరించే ఉద్దేశం కేంద్రానికి లేదని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో.. రాజధానులు మార్చుకుంటామంటే.. సహకరిస్తామన్నట్లుగా మాట్లాడారు. రాజధానిని నోటిఫై చేస్తూ..గత ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలా శాసనం కాదని.. ఇప్పుడు మళ్లీ జగన్ జీవో ఇస్తే.. కేంద్రం నోటిఫై చేస్తుందని చెప్పుకొచ్చారు. అంటే.. ప్రత్యేకహోదా గురించి మాట్లాడకపోతే… రాజధాని గురించి కేంద్రం మాట్లాదన్నట్లుగా… జీవీఎల్ ఆఫర్ ఇచ్చినట్లుగా ఆయన ప్రకటన ఉంది. హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా గురించి లేఖ రాయడం…బీజేపీ వర్గాలను సైతం నివ్వెర పరిచినట్లుగా తెలుస్తోంది.
ఇంత కాలం ఓ అండస్టాండింగ్తోనే జగన్ హోదా మాటలను పక్కన పెట్టారని భావిస్తున్నారు. మొదట్లో.. ప్రత్యేకహోదా అంశాన్ని లేవనెత్తిన జగన్.. తర్వాత సైలెంటయ్యారు. మళ్లీ ఇప్పుడు హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారు. దీంతో.. బీజేపీకి కోపం వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీ నుంచి జగన్‌కు వచ్చిన ప్రత్యేకమైన వార్నింగ్‌లు లేవు. కానీ ఈ విషయంలో మాత్రం.. జీవీఎల్ మాటలు కఠువుగానే ఉన్నాయి. జగన్ … హోదా అంశాన్ని మరింత పెద్దది చేస్తారో.. జీవీఎల్ బెదిరింపులకు భయపడి.. ఆపేస్తాో చూడాలి.