రాజధాని రైతుల వాణిని దేశం నలుమూలలా వ్యాపింపచేశానని నినదిస్తానని..జనసేన అధినేత పవన్ కల్యాణ్ శపథం చేశారు. ఈ నెల పదో తేదీ తర్వాత తాను స్వయంగా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. రాజధాని రైతుల ఉద్యమస్ఫూర్తి చూసి.. తెలుగు వారంతా గర్విస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి నిస్వార్థంగా 33 వేల ఎకరాలు ఇచ్చి.. ఇప్పుడు రోడ్డున పడ్డ రైతన్నలకు అండగా ఉంటానని ప్రెస్‌నోట్ విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కల్యాణ్ రాజధాని విషయంలో సైలెంటయిపోయారు. బీజేపీ.. అమరావతి విషయంలో.. మొత్తం.. వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోందని… పవన్ కల్యాణ్ ను నోరెత్తకుండా చేసిందన్న ప్రచారం జరిగింది.
అమరావతి కోసం ఉమ్మడి పోరాటం చేస్తామంటూ గంభీరంగా ప్రకటించిన.. జనసేన, బీజేపీ నేతలు.. ఆ తర్వాత కామ్‌గా ఉండిపోయారు. పవన్ కల్యాణ్ కూడా… బీజేపీ విషయంలో కాస్త తేడా అనుకున్నారేమో కానీ.. సొంత పర్యటన షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. వచ్చే నెల పదో తేదీ తర్వాత తన పర్యటన ప్రకటన విషయంలో పవన్ కల్యాణ్ బీజేపీని సంప్రదించలేదని.. తెలుస్తోంది. అమరావతి తరలింపును ఆపగల శక్తి బీజేపీకి ఉందన్న ఉద్దేశంతోనే …ఆ హామీతోనే తాను పొత్తు పెట్టుకున్నట్లుగా పవన్ చెబుతున్నారు. పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాత అనూహ్యంగా బీజేపీ సైడయ్యే ప్రయత్నం చేస్తోంది.
దీంతో బీజేపీ.. తనను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్న అనుమానం పవన్ కల్యాణ్‌కు వచ్చిందంటున్నారు. అందుకే.. అమరావతి రైతుల విషయంలో తన చిత్తశుద్ధిని చూపించుకోవాలని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పదో తేదీ తర్వాత పవన్ చేపట్టబోయే రాజధాని గ్రామాల యాత్రకు బీజేపీ కలిసి వెళ్లకపోతే.. మైత్రి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మారే పరిస్థితి ఉంటుంది.