రాజధాని అంశం పూర్తిగా కేంద్ర పరిధిలోనిదని చెబుతున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. అన్యాపదేశంగా అయినా.. కేంద్రం ఆమోదం తప్పని సరి అన్న విషయాన్ని అంగీకరించారు. గత ప్రభుత్వం.. రాజధానిగా అమరావతిని నోటిఫై చేసిందని.. అదేమి శిలాశాసనం కాదని.. కొత్త ప్రభుత్వం కూడా జీవో జారీ చేస్తే.. దాన్ని కేంద్రం ఆమోదిస్తుందని ప్రకటించారు. జీవీఎల్ చేసిన ఈ ప్రకటనలోనే కేంద్ర ప్రమేయం ఉందనే విషయం స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజధాని పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదే కానీ.. అది.. మార్చుకోవడానికి కాదని.. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు.. ఓ రాజధాని ఏర్పాటు చేసుకోవడానికే పరిమితమన్న అభిప్రాయం.. న్యాయనిపుణుల్లో వస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ..కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కారణాలు లేకుండా… రాష్ట్ర పరిధిలోని అంశమని ఇష్టం వచ్చినట్లుగా రాజధానిని మారిస్తే.. కేంద్రం .. తమకు సంబంధం లేదని ఎలా ఉంటుందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా.. కేంద్రానికి సంబంధం లేదన్నది అబద్దమని… కొన్ని లీగల్ పాయింట్లను తన ప్రసంగాల్లో చెబుతున్నారు. ఇండియా మ్యాప్‌లో అమరావతిని నోటిఫై చేశారని.. అమరావతి కేంద్రంగా హైకోర్టు ఇస్తున్నామని రాష్ట్రపతి చెప్పారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో.. పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేసినా చెల్లదని.. న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో అధికారం ఉన్నా చట్టం చేసినప్పుడు.. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం సహేతుకంగా లేకపోతే.. రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పులు ఉన్నాయంటున్నారు. అంటే.. ఎలా చూసినా.. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా… మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదనే విషయంపై మాత్రం జీవీఎల్ మాటలతోనే క్లారిటీ వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.