సంక్రాంతి అనగానే పెద్ద సినిమాల కోలాహలం కనిపిస్తుంది. 2020 సంక్రాంతి చూశాం కదా? ఒక వారం వ్యవధిలో నాలుగు పెద్ద సినిమాలు పలకరించాయి. 2021లో మాత్రం ఆ అవకాశం కనిపించదేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. ‘మేం సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ రాజమౌళి జెండా ఊపారు. 2021 జనవరి 8న ‘ఆర్.ఆర్.ఆర్’ వస్తోంది. రాజమౌళి సినిమా వస్తోందంటే… మిగిలిన సినిమాలకు హడలే. బాహుబలి సమయంలో ఇదే జరిగింది. బాహుబలికి ముందు, ఆ తరవాత 15 రోజులు గ్యాప్ వచ్చేలా జాగ్రత్త పడ్డాయి సినిమాలన్నీ. ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా అలాంటి ఎఫెక్టే చూపించబోతోంది.
2021 సంక్రాంతికి రావాలన్న ఉద్దేశంతో కొన్ని సినిమాలు ప్రిపేర్ అవుతున్నాయి. అయితే వాటన్నింటికీ చెక్ చెప్పేశాడు రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ అంటే దాదాపు రెండు సినిమాలకు సమానం. అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ – ఇద్దరూ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ ఇది. దానికి తోడు రాజమౌళికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా ఇచ్చే పోటీ తట్టుకోవడం చాలా కష్టం. దాంతో ఈ సంక్రాంతి రేసు నుంచి మిగిలిన సినిమాలు తప్పుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతికి వద్దామని ఆశించిన సినిమాలు ముందుకో వెనక్కో వెళ్లడం ఖాయం.
కానీ ఇక్కడ రాజమౌళి చేసిన ఓ మంచి పని. జనవరి 8నే వచ్చేయడం. అంటే పండక్కి ఇంకో వారం సమయం ఉంటుంది. 14, 15వ తేదీల్లో సినిమాని విడుదల చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే అది కూడా రాజమౌళి సినిమా ఫలితాన్ని, ప్రభంజనాన్ని బట్టి ఉంటుంది. సంక్రాంతి సీజన్లో ఎన్ని సినిమాలొచ్చినా ఫర్వాలేదు అనుకుంటే మాత్రం మిగిలిన సినిమాలు రంగంలోకి దిగొచ్చు. కాకపోతే.. ఆర్.ఆర్.ఆర్కి కనీసం నాలుగైదు రోజులు గ్యాప్ తప్పని సరి. దానికి తోడు `భారతీయుడు 2`కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఇది డబ్బింగ్ సినిమానే కావొచ్చు. కానీ ఓ స్ట్రయిట్ సినిమా ఇచ్చినంత కిక్ ఇవ్వగలదు. ఇటు రాజమౌళి, అటు శంకర్.. ఈ రెండు కొండల్ని ఢీ కొట్టడానికి ఎవరైనా ధైర్యం చేయగలరా? అయితే శంకర్ ప్లానింగులు అంత గొప్పగా ఉండవు. ఆయన సినిమాలు వాయిదా మీద వాయిదాలు పడడం మామూలే. భారతీయుడు 2కీ ఈ ఇబ్బందులు తప్పకపోవొచ్చు. మొత్తంగా చూస్తే… ఈ సంక్రాంతి ఆర్.ఆర్.ఆర్ ప్రభావం చాలా కనిపించబోతోంది. దాని పక్కన మిగిలిన సినిమాలు బోసిబోవడం ఖాయం.