హైదరాబాద్: దేశ సరిహద్దుల్లోని సియాచిన్లో సముద్రమట్టానికి 19,600 అడుగుల ఎత్తున ఈ నెల 3న జరిగిన హిమపాతంలో 10 మంది సైనికులు మంచుకింద కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ పదిమంది కోసం తీవ్రంగా గాలించి జాడ లభించకపోవటంతో వారిపై దాదాపు ఆశలు వదులుకోగా, నిన్నరాత్రి ఒక అద్భుతం జరిగింది. ఆచూకీ లేకుండా పోయిన పదిమందిలోని ఒక జవాన్ 25 అడుగుల మేర పేరుకుపోయిన మంచుకింద ప్రాణాలతో కనిపించారు. ఆయనను రక్షించి చికిత్సకోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మైనస్ 45 డిగ్రీల చలిలో అతను ఆరు రోజులు ఎలా బతికున్నాడనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. సియాచిన్ ప్రాంతంలో విధులు నిర్వర్తించే సైనికులందరికీ ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవటానికి ముందే శిక్షణ ఇస్తారు. హనుమంతప్ప విషయంలో అదృష్టవశాత్తూ అతను గాలి అందటానికి వీలున్నచోట కూరుకుపోవటం కలిసొచ్చింది. అతను వేసుకున్న దుస్తులు కూడా శరీరాన్ని వెచ్చగా ఉండేందుకు సహకరించి హైపో థర్మియా సోకకుండా చేశాయి. మూత్రవిసర్జన చేయకుండా ఉండటంకూడా శరీరంలో వేడిని నిలిపి ఉంచుతుందని, ఈ కారణాలన్నింటివల్లే హనుమంతప్ప బతికారని అంటున్నారు. ఏది ఏమైనా అతనికి ఈ భూమిపై ఇంకా నూకలు మిగిలున్నాయని చెప్పాలి. మరోవైపు అతను బతికున్న వార్త తెలియటంతో కర్ణాటకలోని అతని కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
https://www.youtube.com/watch?v=qyiNxf5kpN8