ఏదో ఒకలా హిందుత్వ కార్డును తెర మీదికి తీసుకొచ్చి, తామే అసలు సిసలైన హిందు రక్షకులమనే ఇమేజ్ కోసం భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. తెలంగాణలో కూడా ఈ తరహా ఇమేజ్ కోసం చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నా… సరైన అవకాశాలు భాజపాకి చిక్కడం లేదు! ఆ మధ్య యాదగిరి గుట్టలో శిల్పాల అంశాన్ని తెర మీదికి తెచ్చి లాభపడే ప్రయత్నం చేసినా… దానికీ పెద్దగా స్పందన ప్రజల నుంచి రాలేదు. ఇప్పుడు మేడారం జాతర నేపథ్యంలో మరోసారి ఇదే ప్రయత్నం చేశారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.
మేడారం జాతరకు లక్ష్మణ్ వెళ్లారు. రొటీన్ గా ఏమంటారూ… ఇక్కడి ఏర్పాట్లు బాగులేవనీ, భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే అంటారు, లక్ష్మణ్ అదే అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా మేడారం జరుగుతుందనీ, ఇక్కడి వస్తున్న భక్తులకు కనీస సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు. రెండేళ్ల కింద జాతర జరిగినప్పుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా హామీలు ఇచ్చారనీ… ఇక్కడే మకాం వేసి అన్ని పనులూ చేయిస్తా అన్నారనీ, 200 ఎకరాల భూమిని సేకరించి, రూ. 200 కోట్లు నిధులతో జాతర అభివృద్ధి పనులు చేస్తామన్నారు. కానీ, ఆ హామీలేవీ నెరవేర్చలేదన్నారు. దేవుళ్లనూ దేవతల్నీ మోసం చేసే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారారనీ, శక్తివంతమైన వనదేవతలు కేసీఆర్ ని క్షమించరన్నారు. అమ్మవార్లు చాలా కోపోద్రిక్తులై తప్పకుండా ఈ ప్రభుత్వం నిర్వాకానికి తగిన శిక్ష వేస్తారన్నారు!!
గొప్ప హిందువుని అని చెప్పుకునే కేసీఆర్, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సిద్ధమౌతుంటే ఆయన ఎందుకు స్పందించలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆయన పైకి హిందువుగా నటిస్తున్నారన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలంటే… రాష్ట్రంలో తమకు అధికారం ప్రజలు ఇవ్వాలన్నారు! ఇక్కడ కూడా రాజకీయం చేసే ప్రయత్నమే లక్ష్మణ్ చేశారు. మేడారం జాతీయ పండుగ చేస్తే ఎవరు వద్దంటారు..? దాని కోసం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే వరకూ ఆగాల్సిన పనిలేదు కదా..? హిందుత్వ పరిరక్షణే తమ కర్తవ్యం అని కంకణం కట్టుకున్నప్పుడు మేడారం మీద భాజపా స్పందించొచ్చు కదా..? వన దేవతలు కేసీఆర్ మీద కోపోద్రిక్తులు అవుతారు, శపిస్తారు, నాశనం చేస్తారు లాంటి వ్యాఖ్యలు ఒక ప్రజాప్రతినిధి చేయడాన్ని ఏమనుకోవాలి?