మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రజల మద్దతు ఉందని… ఏపీ మంత్రులు బల్లగుద్ది చెబుతున్నా.. సోషల్ మీడియా పోల్స్‌లో మాత్రం ఆ ట్రెండ్స్ కనిపించడం లేదు. వైసీపీకి ఫేవర్‌గా.. జగన్ అంటే అభిమానం చూపిస్తున్న… సాక్షి పత్రిక.. అడ్వర్టయిజింగ్ పార్టనర్ ది హిందూ నిర్వహిస్తున్న పోల్స్‌లోనూ పరిస్థితి అనుకూలంగా ఉండటం లేదు. ఆ సంస్థకు చెందిన బిజినెస్ ఆన్ లైన్… నిర్వహించిన పోల్‌లో… మూడు రాజధానులకు అసలు మద్దతు లభించలేదు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని 83 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తెలివైనదేనా అంటూ ది హిందూ బిజినెస్ లైన్ సర్వే చేపట్టింది.
డిసెంబరు 28న ఈ ప్రక్రియ మొదలుపెట్టగా.. 6వ తేదీ వరకు 3 లక్షల 20వేల మందికిపైగా స్పందించారు. వీరిలో 83 మంది ప్రజలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే…16శాతం మంది స్వాగతించారు. ఒక్క శాతం మాత్రం ఎటూ చెప్పలేమన్నారు. ఆన్ లైన్ పోల్స్‌లో లక్షల సంఖ్యలో ఓట్లు పడటం.. చాలా అరుదుగా సాగుతూంటుంది. జగన్.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు ఇండియా టీవీ…జగన్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వే నిర్వహించింది. పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేయడంపై ఏపీ ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.
మూడింట రెండు వంతుల మంది వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఏ పోల్.. ఏ ప్రజాభిప్రాయసేకరణ జరిగినా… మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ కాదనే వస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం.. తమకు ప్రజల మద్దతు ఉందని చెబుతూ.. ముందుకెళ్లిపోతోంది.