కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఈ ప్రయత్నమేదో మొదట్నుంచీ… అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచీ బలంగా చేసి ఉంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం కంటే కొంత మెరుగ్గా ఉండేదేమో! ఆ ప్రయత్నం చెయ్యాల్సిన సమయంలో చెయ్యకుండా… ఇప్పుడు ఏం చెప్పినా ప్రజల్లోకి తీసుకెళ్లలేని స్థాయిలో పార్టీ ఉన్నప్పుడు మాట్లాడి ఏం లాభం..?
మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందనీ, దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు పొన్నాల. ప్రజా జీవితంలో ఏనాడూ కేసీఆర్ ప్రజల పక్షాన నిలబడలేదనీ, రాష్ట్రమంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్రమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు… తెలంగాణ అవసరాలు, ఇక్కడి ప్రాజెక్టుల గురించి ఏరోజూ మాట్లాడలేదన్నారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు కేవలం తన కుటుంబ సభ్యుల కోసమే ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు. ఈరోజున విశ్వ నగరంగా హైదరాబాద్ కి పేరొస్తోందీ అంటే కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, తాజాగా పూర్తయిన మెట్రో రైలు… ఈ ప్రాజెక్టు ఆలోచన చేసి, వ్యూహం సిద్ధం చేసి, ప్రణాళికలు వేసి నిధులు కేటాయించింది కాంగ్రెస్ అన్నారు. అయితే, సత్వరం పూర్తయితే తమకు పేరొస్తొందనీ, కొన్నాళ్లు అడ్డుకుని… ఇప్పుడు తాము గతంలో ఖారారు చేసిన డిజైన్ ప్రకారమే పనులు పూర్తి చేశారన్నారు.
పొన్నాల వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదు. కానీ, ఈ వాదన వినిపించడంలో ఆలస్యమైంది! ఇదేకాదు… తెలంగాణ వచ్చింది కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. కానీ, అంతటి బలమైన అంశాన్ని కూడా తెలంగాణలో పార్టీకి కలిసొచ్చే అంశంగా మార్చుకోవడంలో రాష్ట్ర నేతలు విఫలమయ్యారనే చెప్పాలి. పార్టీ చేసింది చెప్పుకునే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యలేదు. నాయకుల మధ్య ఆధిపత్య పోరుకే ప్రాధాన్యత ఇచ్చి, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా తెలంగాణకు చేసినవి ప్రజలు పూర్తిగా మరిచిపోయేంతగా ఉపేక్షించేశారు! అందుకే ఇప్పుడు పొన్నాల మాట్లాడుతుంటే… ఇవి కొత్తగా వినిపిస్తున్నాయి. ఇదే ప్రయత్నం ముందు నుంచీ కొనసాగించి ఉంటే కొంత బాగుండేది.