చిత్తూరు జిల్లా రేణిగుంటకు రూ. పదిహేను వేల కోట్ల పెట్టుబడితో రావాల్సిన రిలయన్స్ పరిశ్రమకు ప్రభుత్వమే స్వయంగా పొమ్మనలేక పొగ పెడుతోంది. ఆ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించిన భూములు వెనక్కి తీసుకుని… ఇళ్ల స్థలాలుగా మార్చాలని నిర్ణయించుకుంది. దీంతో.. రిలయన్స్ పెట్టుబడులు… వెనక్కి పోయినట్లేనని… ప్రభుత్వమే భూములు ఇవ్వకుండా.. పొమ్మనక.. పొగ పెట్టిందని… పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వాలు.. ఇలా మొండితనంతో వ్యవహరిస్తే.. రిలయన్స్ వంటి సంస్థలు.. ముందూ వెనుకా కూడా చూసుకోవు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా.. తమ ప్లాంట్లను వేరే చోట పెట్టుకుంటాయి.
తెలుగుదేశం పార్టీ హయంలో చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లో రిలయన్స్ సంస్థ.. సెల్ ఫోన్లు, సెట్‌టాప్ బాక్సులు సహా.. జియో అవసరాలకు ఉపయోగపడే.. సమస్త ఎలక్ట్రానిక్ సామాగ్రిని ఉత్పత్తి చేసేందుకు ఓ సెజ్ ప్రారంభించాలనుకుంది. ప్రభుత్వం భూములు కేటాయించింది. అంబాని ప్రత్యేకంగా వచ్చి.. చంద్రబాబుతో మాట్లాడి వెళ్లారు. తర్వాత ఫైళ్లు చకచకా నడిచాయి. 150 ఎకరాల స్థలం అవసరమని సంస్థ కోరగా.. రేణిగుంట మండలంలో ప్రభుత్వ భూమి 137 ఎకరాలను… రిలయన్స్‌కు కేటాయించారు. ఈ భూముల కోసం డబ్బును కూడా.. రిలయన్స్ ప్రభుత్వానికి కట్టింది.
రిలయన్స్ పరిశ్రమ విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం వ్యతిరేకతతో ఉంది. ఆ పరిశ్రమ వస్తే.. వచ్చే ఉపాధి అవకాశాలు జరిగే అభివృద్ధి కన్నా… 130 ఎకరాల భూమి ఇవ్వడం అవసరం లేదన్న భావనలో ఉంది. ఇప్పుడు.. ఆ భూమి కేటాయింపులను రద్దు చేసి… ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని… సూచనలు వెళ్లాయి. తిరుపతిలో ఇరవై నాలుగు వేల కుటుంబాలకు స్థలాలు లేవని.. వారి కోసం ఆ భూముల్ని ప్లాట్లుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే… రేణిగుంట ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లో గత సర్కార్ పలు సెల్ ఫోన్ పరిశ్రమలను ప్రారంభించింది. వాటికి తోడు.. రిలయన్స్ ప్రారంభమైతే… సెల్ ఫోన్ల తయారీ కి కేంద్రంగా తిరుపతి మారుతుందన్న అంచనాలు వచ్చాయి. అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆలోచన భిన్నంగా ఉంది. అసలు సంస్థలకు భూములు కేటాయించడమే తప్పని భావిస్తున్నారు.
రిలయన్స్ వెళ్లిపోతుందంటూ… ప్రచారం జరిగినప్పుడల్లా… పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి.. అంతా అసత్య ప్రచారమేనని.. రిలయన్స్ ప్లాంట్ వస్తుందని చెబుతూ ఉంటారు. కానీ.. అదంతా.. ఉత్తుత్తి ప్రకటనలేనని.. ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం.. చిత్తూరుకు రిలయన్స్ ఫ్యాక్టరీ అవసరం లేదని.. అంచనా వేస్తున్నారు.