హైదరాబాద్‌లో శుక్రవారం.. ఓ చారిత్రాత్మకమైన ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలో అతి పెద్ద పీపీపీ మోడల్ మెట్రో ఆవిష్కృతమయింది. ఆ వేడుక అటు జరుగుతూండగానే… ఏపీ సర్కార్ నుంచి ఓ ప్రకటన మీడియాకు అందింది. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే.. విశాఖలోని మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్ ల రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందనేది. కోటేషన్లను పిలించేందుకు అమరావతి మెట్రోరైల్ ఎండీకి సీఎం ఆదేశించారనేది సమాచారం. నిజానికి విశాఖ మెట్రోకు సంబంధించి గత ప్రభుత్వమే డీపీఆర్‌ల పని పూర్తి చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. తీసుకున్న రద్దుల నిర్ణయాల్లో.. ఆ డీపీఆర్‌లు కూడా ఉన్నాయి. దాంతో.. పరిస్థితి మొదటికి వచ్చేసింది.
ఆ తర్వాత .. పెద్దగా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు.. నిన్న హైదరాబాద్‌లో మెట్రో ప్రారంభమయ్యే కార్యక్రమం చూశారేమో కానీ. మేలుకున్నారు. విశాఖలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నిర్మాణం కోసం కొత్త డీపీఆర్ రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ , రైట్స్, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాలని ఆదేశించారు. మూడు కారిడార్లలో మెట్రో రైల్ నిర్మాణం కోసం డీపీఆర్‌ల రూపకల్పన చేయాలని.. 60 కి.మీ మేర మోడర్న్ ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు మరో డీపీఆర్ కోరాలని ప్రభుత్వం ఆదేశించింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం అన్నీ ఉన్నాయి.. ఒక్క మెట్రో వేస్తే సరిపోతుందని.. జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.
కానీ.. అంతకు ముందు మెట్రో కోసం.. జరిగిన ప్రక్రియ మొత్తాన్ని నిలిపివేశారు. ఓ కొరియా కంపెనీ రుణం ఇచ్చేందుకు అంగీకరించినా.. లైట్ తీసుకున్నారు. ఇప్పుడు.. మళ్లీ మొదటి నుంచి ప్రారంభించమని ఆదేశించారు. కేంద్రం పెట్టుబడిగా పెట్టినా …. హైదరాబాద్ మెట్రో డీపీఆర్ స్టేజ్ నుంచి ప్రారంభం కావడానికి పదేళ్లు పట్టింది. మరి విశాఖ మెట్రోకు మోక్షం ఎప్పుడో ..!