కియాను అనంతపురం నుంచి తరలిస్తున్నట్లుగా రాయిటర్స్ రాసిన కథనం వెనక్కి తీసుకుందని .. తెలుగు నెంబర్ వన్ టీవీ చానల్ టీవీ9 ఉదరగొట్టేసింది. అలా అని టీవీ9కి ఎవరు చెప్పారో.. అలా చెప్పాలని ఎవరు చెప్పారో కానీ.. నిజం తెలిసిన తర్వాత కూడా.. ఆ ప్రసారాన్ని నిలిపివేయలేదు. తాము తప్పుడు రిపోర్ట్ చేశామని అంగీకరించలేదు. చివరికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా కూడా.. ఈ విషయంలో కాస్త సంయనమం పాటించింది. ఆన్ లైన్ ఎడిషన్‌లో.. ఇలా రాయిటర్స్.. తప్పు చేసిందని లెంపలు వేసుకుందని.. రాసేసినా.. తర్వాత.. తన తప్పు తెలుసుకుంది. పత్రికలో ఎలాంటి కథనం అచ్చు వేయలేదు. కానీ.. సాక్షి మీడియా కంటే.. ఎక్కువ భక్తిని టీవీ9 చూపిస్తోంది. రాయిటర్స్ కథనం వెనక్కి తీసుకుందని అదే పనిగా చెబుతూ వచ్చింది.
ఓ వార్త సంస్థ రిపోర్ట్‌ను.. పూర్తి రివర్స్‌లో చెప్పే మీడియా సంస్థలు తెలుగులోనే ఉన్నాయి. దానికి కియా తరలింపు వ్యవహారంపై రాయిటర్స్ రాసిన వార్తను… డిలీట్ చేసిందని.. క్షమాపణ చెప్పిందంటూ… శనివారం సాయంత్రం నుంచి కొంత మంది అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. కానీ.. రాయిటర్స్ .. తన వార్తను అసలు డిలీట్ చేయలేదు సరి కదా.. ఇంకాస్త క్లారిటీగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కియాను తరలించడానికి .. యాజమాన్యం.. పూర్తి స్థాయిలో సిద్ధమయిందని.. చెప్పుకొస్తోంది. రాయిటర్స్ ఇంగ్లిష్‌లో పెట్టిన ట్వీట్ చాలా మందికి అర్థం కాక… తన కథనాన్ని వెనక్కి తీసుకుందని ప్రచారం చేస్తూండటంతో.. వెంటనే.. మరింత క్లారిటీగా.. ట్వీట్ చేసింది.
రాయిటర్స్ తన కథనానికి కట్టుబడి ఉందని.. ఇంకా క్లారిటీగా చెప్పాల్సిన విషయం చెప్పిందన్న విషయాన్ని టీవీ9 … ప్రేక్షకులకు అందించడానికి మొహమాట పడింది. అదే పనిగా.. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసింది. నిజం తెలుసుకున్న తర్వాతైనా.. తమ తప్పు దిద్దుకునే ప్రయత్నం చేయలేదు. టీవీ 9 యాజమాన్యం మారిన తర్వాత జర్నలిజం ప్రమాణాలు దిగజారిపోతున్న సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ కొంత మందిపై వ్యతిరేక ప్రచారం చేయడం.. కొంత మందిని మోయడం వంటివి చేస్తున్నారు కానీ.. నేరుగా తప్పుడు వార్తలు రాసేసి.. తప్పు తెలిసినా దిద్దుకునే ప్రయత్నం జరగడం మాత్రం ఇదే మొదటి సారి. ఈ పతనం ఇలా కొనసాగుతూ ఉంటుందేమో..?