” వైసీపీలో చేరితే నేను నా నెంబర్ 152… అదే జనసేనలో ఉంటే నెంబర్ వన్. ఎవరైనా ఏది కోరుకుంటారు..?… ” ఈ డైలాగ్ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.. ఎన్నికలు ముగిసిన నాటి నుండి చాలా రోజుల పాటు చెప్పారు. కానీ ఆయనకు రాను రాను ఒకటిలో ఉండి బోరు కొట్టిందో.. లేక పోతే.. 152కి వెళ్లిపోతే.. కాస్త అధికారం అనుభవించవచ్చనుకున్నారో అనుకున్నారో కానీ.. అనధికారికంగా ఆయన 152కి చేరిపోయారు. దాని కోసం… పవన్ కల్యాణ్ ను విమర్శించడం కూడా ప్రారంభించారు. అంత వరకూ బాగానే ఉంది. ఆ 152 పొజిషన్ .. ఒకటికి ఎంత దూరమో తెలిసి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.
రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి జగన్ వెళ్లారు. అక్కడ మీడియాపై..పోలీసులు ఆంక్షలు విధించారు. దాంతో ఏం జరిగిందో పెద్దగా బయటకు రాలేదు. మెల్లగా తెలిసిన విషయాల ప్రకారం.. ఎమ్మెల్యే రాపాకను.. పోలీసులు కనీసం జగన్ దగ్గరకు కూడా పోనివ్వలేదు. అడ్డుకుని నెట్టేశారు. జగన్ వద్దకు వెళ్లి ఏదో చెప్పుకుందామని ఆశ పడిన రాపాకకు అలాంటి అవకాశం దక్కలేదు. అదే.. మరో చోట… పవన్ కల్యాణ్ సభలో అలా జరిగి ఉంటే.. ఈ పాటికి.. దళిత ఎమ్మెల్యేకు అవమానం అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయేది. కానీ రాపాకకు జరిగిన అవమానం.. దళిత ఎమ్మెల్యేకు కాకుండా.. ఓ ఫిరాయింపు ఎమ్మెల్యేకు జరిగినట్లుగా సోషల్ మీడియాలో భావిస్తోంది. అందుకే ఆయనకు సానుభూతి కూడా దక్కడం లేదు.
సాధారణంగా వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వరు. వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో… ఎనిమిది నెలల్లో జగన్ ను కలిసిన వారు పట్టుమని 50 మంది కూడా ఉండరు. ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వరు. ఎమైనా కావాలంటే… విజయసాయిరెడ్డితోనే.. సజ్జల రామకృష్ణారెడ్డితోనే మాట్లాడుకోవాలి. రాపాకకు ఆ అవకాశం కూడా పెద్దగా లేకుండా పోయినట్లుగా ఉంది. అసెంబ్లీలో చాన్స్ దొరికిందని ఓ సారి మట్లాడేశారు కానీ… జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు రాజమండ్రి వస్తే కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే రాపాకకు అలా జరగాల్సిందే అంటున్నారు జనసైనికులు.