అగ్గి రాజుకుంటోంది. రాజధాని రగడ రోజురోజుకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేయాలని నిర్ణయించిన జగన్ సర్కార్ కు కష్టకాలం ప్రారంభమవుతోంది. నిన్నమొన్నటి వరకూ రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల వారే నిరసన వ్యక్తం చేస్తున్నారని, అందులోనూ కేవలం మూడు, నాలుగు గ్రామాల వారి నుంచే ఎక్కువ నిరసనలు వ్యక్తం అవుతున్నాయని చెబుతున్న మంత్రుల మాటలకు కాలం చెల్లుతున్నట్లే కనిపిస్తోంది. అమరావతిలో గడచిన 55 రోజులుగా దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ లోని ఇతర జిల్లాలకు చెందిన రైతులు, సామాన్యులు కూడా తమ గళాలను విప్పుతున్నారు. ఈ గళాలకు మరో తెలుగు రాష్ట్ర్రమైన తెలంగాణా కూడా గొంతు కలిపింది. ఆదివారం నాడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కొనసాగాలంటూ నిరసన ప్రదర్శనలు చేశారు. ఇలా నిరసనలు తెలిపిన వారిలో రాజధాని జిల్లాలకు చెందిన వారే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని ఇతర జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన వారు కూడా ఉండడం గమనార్హం. ఇక తెలంగాణకు చెందిన వారు కూడా అమరావతిని మార్చడం ఎందుకు అంటూ తమ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆదివారం నాడు రైతులు, సామాన్యులు స్వచ్ఛంధంగా నిర్వహించిన రాజధాని తరలింపు వ్యతిరేక సభ సూపర్ హిట్ అయ్యింది. ఈ సభకు వంగవీటి రాధా ముఖ్యఅతిధిగా హాజరై అమరావతి రాజధాని విశిష్టతను తెలియజేశారు. ఈ సభను నిర్వహించింది తెలుగుదేశం పార్టీ వారే అని అధికారం పార్టీ స్ధానిక నాయకులు చెబుతున్నా ఈ నిరసన సభలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది రైతులు, రైతు కూలీలు, మధ్యతరగతికి చెందిన వారే కావడం విశేషం.
రాయలసీమలోనూ….
అమరావతిలో శాసనసభ, విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించినా రాయలసీమ వాసులు మాత్రం నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. హైకోర్టు వస్తే సరిపోదని, తమకు సంపూర్ణ రాజధాని కావాల్సిందేనంటూ కొందరు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సీమ నాయకులు కొందరు… అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని, లేదంటే రాయలసీమలోనే సంపూర్ణ రాజధానిని ఏర్పాటు చేయాలంటూ పట్టుబడుతున్నారు. అనంతపురంలో ఇటీవల అమరావతికి అనుకూలంగా నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో రాజధాని మార్పుపై సీమ వాసుల్లోను వ్యతిరేకత వస్తోంది. రాయలసీమలోని కర్నూలు మినహా మిగిలిన జిల్లాలకు చెందిన రైతులు, రైతు కూలీలు ఇప్పటికే అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు మరో పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కూడా అమరావతి తరలింపు సెగ రాజుకుంది. అక్కడి తెలుగు వారంతా ఏకమై రాజధానిని ముక్కలు చేయడం తగదంటూ తీర్మానించారు. ఇలా అన్ని వైపుల నుంచి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అగ్గి రాజుకోవడం పట్ల అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోను కంగారు రేకెత్తిస్తోంది.