ఇది వరకు మౌనముని గా ఉండే రాఘవేంద్రరావు.. ఈమధ్య మాట్లాడడం మొదలెట్టారు. అలా ఇలా కాదు.. `మైకాసురుడు` అవతారమే ఎత్తేస్తున్నారాయన. వేదిక ఎక్కితే స్పీచులు దంచికొడుతున్నారు. ఏదైనా కొత్త సినిమా విడుదలైతే, దాన్నిచూడడం… అనర్గళంగా మాట్లాడడం హాబీగా మార్చేసుకున్నారు. ఈమధ్య ఆయనకు `జానూ` బాగా నచ్చేసింది. అందుకే థ్యాంక్స్ మీట్‌కి వచ్చి మరీ – ఆ సినిమాని ఆకాశానికి ఎత్తేశారు.
ఈ సినిమా బాగుంది, సూపర్ హిట్టు, డూపర్ హిట్టుఅనడం ఒక ఎత్తు. థ్యాంక్స్ మీట్‌కి పిలిచినందుకు కనీసం ఈ స్థాయిలో పొగడాల్సిందే. కానీ దర్శకేంద్ర ఆ డోసు పెంచారు. “గీతాంజలి, పదహారేళ్ల వయసు లాంటి సినిమా ఇది. నాగార్జున, గిరిజ.. కమల్‌హాసన్ – శ్రీదేవిలా శర్వా, సమంత నటించారు. ఈ సినిమా చూసి ఏడ్చేశాను“ అంటూ కళాఖండాలతో, గొప్ప గొప్ప నటులతో పోలికలు తీశారు. సమంత, శర్వా బాగా నటించారు. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఈ సినిమాని గొప్ప గొప్ప కళా ఖండాలతో పోల్చడం, శర్వా, సమంతలను కమల్ – శ్రీదేవిలను చేసేయడమే కాస్త ఓవర్ అనిపించింది.