క్రికెట్ జెంటిల్మన్ గేమ్. హుందాగా ఆడుకునే ఆట. స్లెడ్జింగ్ లాంటి వ్యూహాలతో కొన్ని జట్లు ఆ జెంటిల్మన్ గేమ్‌ను దారి తప్పించాయి. ఇది ఎంతగా ప్రభావం చూపిస్తోందంటే… అండర్ 19 ఆడే కుర్రాళ్లపైనా… చూపిస్తోంది. ప్రత్యర్థి ఆటగాళ్లను.. మాటలతోనే కాదు.. ఉద్దేశపూర్వకంగా “బాడీలైన్” చేయడానికి కూడా వెనుకాడని తత్వం కనిపిస్తోంది. అండర్ 19 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల వ్యవహారశైలినే దీనికి నిదర్శనం. భారత ఆటగళ్లను.. భయపెట్టాలని.. దానికి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాలని డ్రెస్సింగ్ రూమ్‌లోనే ప్లాన్ వేసుకున్నారేమో కానీ.. బౌలింగ్‌తో కాకుండా.. ఇతర విధాలుగా.. భారత కుర్రాళ్లను భయ పెట్టే ప్రయత్నం చేశారు.
ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్.. భారత ఓపెనర్ దివ్యాన్ష్ సక్సేనా మీదకు బంగ్లా ఫాస్ట్ బౌలర్ తన్జీమ్ హసన్ బంతిని విసిరాడు. ఎలాగైనా మొదట్లోనే వికెట్లు తీయాలనుకుని.. బ్యాట్స్‌మెన్ ఏకాగ్రత దెబ్బతీయాలనుకున్నారు. హసన్ వేసిన బంతిని సక్సేనా డిఫెన్స్ ఆడారు. ఆ బంతిని అందుకున్న తన్జీమ్ వెంటనే సక్సేనాకు తగిలేలా విసిరాడు. తల కాస్త పక్కకు తిప్పడంతో.. సక్సేనాకు తగల్లేదు. లేకపోతే.. ముఖానికి బలంగా బంతి తగిలేది. ఇలా చేసినందు తన్జీమ్ సారీ చెప్పకపోగా… సక్సేనా వైపు చీత్కారంగా చూస్తూ వెళ్లాడు. దీనిపై.. ఫీల్డ్ అంపైర్.. తన్జీమ్ను హెచ్చరించాడు. అయినా ఆటగాళ్ల తీరులో మార్పు రాలేదు. ఈ ఘటనతో డల్ అయ్యారేమో కానీ.. టీమిండియా కుర్రాళ్లు స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు.
మ్యాచ్ అయిపోయిన తర్వాత.. గెలిచిన తర్వాత కూడా.. ఆటగాళ్లు మితి మీరి ప్రవర్తించారు. భారత కుర్రాళ్లను గేలిచేసే ప్రయత్నం చేశారు. ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో ఉంటే ఉండొచ్చు కానీ…ఓడిపోయిన టీమ్ ను అవహేళన చేయడం… చాలా మందిని ఆశ్చర్య పరిచింది. మ్యాచ్ పూర్తయ్యాక.. మీడియాతో మాట్లాడిన రెండు టీముల కెప్టెన్లు కూడా.. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకూడదని.. బంగ్లా కెప్టెన్ చెప్పుకొచ్చారు. మ్యాచ్ గెలవొచ్చు .. ఓడిపోవచ్చు అది సహజమేనని.. కానీ వారి ప్రవర్తన డర్టీగా ఉందని.. టీమిండియా కెప్టెన్ ప్రియం గార్గ్ హుందా తనాన్ని చూపారు. పెద్దగా గొప్ప విజయాలు సాధించకపోయినా… బంగ్లా సీనియర్ ఆటగాళ్లు.. ఇతర జట్లను ఆవమానిస్తూంటారు. వారిలాగే తామూ ఉంటామని.. జూనియర్లు కూడా నిరూపించారు.