ముఖ్యమంత్రి సంతకం చేసిన ఫైలును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెనక్కి పంపితే ఏమవుతుంది..? ఎల్వీ సుబ్రహ్మణ్యంలా ఇంటికిపోతారు. అసెంబ్లీ స్పీకర్ తనకు ఉన్న విచక్షణాధికారాలతో ఇచ్చిన ఆదేశాలను.. రూల్ ప్రకారం లేదంటూ.. అసంబ్లీ కార్యదర్శి తిరస్కరిస్తే ఏమవుతంది..?. స్పీకర్ కావాలంటే.. ఆయనకు జైలు శిక్ష కూడా వేయవచ్చు. అంత అధికారం ఆయనకు ఉంది. అదే శాసనమండలి చైర్మన్ తనకు ఉన్న విశేషాధికారాలతో సెలక్ట్ కమిటీ సభ్యుల్ని నియమించి.. ఆదేశాలు జారీ చేయమని.. మండలి కార్యదర్శికి పంపితే… ఆయన నిబంధనల ప్రకారం లేదని వెనక్కి పంపేశారు. బహుశా.. భారత పార్లమెంటరీ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరిగి ఉండదేమో. శాసనమండలి చైర్మన్ అధికారాల్ని.. శాసనమండలి కార్యదర్శి ప్రశ్నిస్తున్నారు. తన బాస్ అయిన చైర్మన్ ఆదేశాలను పాటించబోనని అంటున్నారు. సెలక్ట్ కమిటీని నియమించాలన్న షరీఫ్ ఆదేశాలను… మండలి కార్యదర్శి మల్లీ చైర్మన్ కే వెనక్కి పంపారు. ఇప్పుడీ విషయం సంచలనాత్మకం అవుతోంది.
సెలక్ట్ కమిటీని రూల్ 154 కింద కమిటీ వేయడం చెల్లదని ఫైలు మీద రాసి… కార్యదర్శి వెనక్కి పంపేశారు. దీనిపై విపక్షాలు భగ్గమంటున్నాయి. శాసనమండలి కార్యదర్శి.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని.. ఆయనపై మండలి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రాజ్యాంగం, చట్టం పట్ల ప్రభుత్వానికి గౌరవం లేదని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. మండలి సెక్రటరీపై ఒత్తిడి తెచ్చి కమిటీని అడ్డుకుంటున్నారని.. కేంద్రం, న్యాయస్థానాలు, రాష్ట్రపతిని కూడా ఆశ్రయిస్తామని ఎమ్మెల్సీలు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లినట్టు ప్రభుత్వం న్యాయస్థానాలకు తెలిపిందనే సంగతిని గుర్తు చేస్తున్నారు.
మండలిలోని అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకునే అధికారం ఛైర్మన్‌కు ఉందని మాజీ స్పీకర్ యనమల స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. శాసనమండలి చైర్మన్ చర్య తీసుకున్నా.. అమలు చేయాల్సింది.. ప్రభుత్వమే కాబట్టి… ఈ విషయంలో… ప్రభుత్వం నుంచి.. భరోసా రావడంతోనే… మండలి కార్యదర్శి… ధిక్కరణకు పాల్పడుతున్నారని అంటున్నారు. దీనిపై మరింత రాజకీయం జరిగే అవకాశం కనిపిస్తోంది.