ఇది భక్త రామదాసు తనను రక్షించమని శ్రీరాముడికి చెప్పాలంటూ సీతాదేవిని వేడుకుంటూ ఆలపించిన కీర్తన. ఈ కీర్తనను ఇప్పుడు రాజధానిని కోల్పోతున్న అమరావతి రైతులు, రైతు కూలీలు, వారి భార్యాపిల్లలూ కూడా ఆలపిస్తున్నారు. గడచిన 55 రోజులుగా వివిధ మార్గాల్లో తమ నిరసన తెలియజేస్తున్న రాజధాని రైతులు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మను కలిసి కుమారుడి మనసు మార్చి అమరావతినే రాజధానిగా కొనసాగించేలా ఒప్పించమని వేడుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
ముట్టడులు, జలదీక్షలు, వీధుల్లోనే వంట వార్పు, అధికార ప్రజాప్రతినిధులకు వేడుకోళ్లు వంటి నిరసనలు తెలియజేసిన అమరావతి రైతులు, వారి కుటుంబ సభ్యులు సీఎం తల్లి విజయమ్మను కలిసి ఆమెకు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఆమెకు వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం ద్వారా తాము చేస్తున్నది రాజకీయ పోరాటం కాదని, అస్థిత్వ పోరాటమని ప్రపంచానికి తెలియజేయాలన్నదే వారి లక్ష్యమని చెబుతున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా లక్ష్య పెట్టని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం తల్లి మాటైనా వింటాడనే నమ్మకంతో విజయమ్మకు వినతి పత్రం ఇవ్వాలని సంకల్పించినట్లు సమాచారం. గతంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ సమయంలో మంద క్రిష్ణ మాదిగ కూడా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లి అమ్మణ్ణమ్మను నారావారిపల్లెలో కలిసి “నీ కుమారుడి మనసు మార్చమ్మా” అని వినతి పత్రం ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడి తల్లి అమ్మణ్ణమ్మ ” ఇవన్నీ నాకు తెలియవు కాని మా వాడికి మీరిచ్చిన కాగితం ఇస్తాను” అని హామీ ఇచ్చారు.
ఆమె చెప్పినట్లుగానే కొడుకుకు మాదిగల డిమాండ్ కు సంబంధించిన పత్రాన్ని కూడా ఇచ్చారు. ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ పై కాసింత సానుకూలంగా వ్యవహరించినట్లు ఎంఆర్ పీఎస్ నాయకులు ఇప్పటికీ చెబుతారు. ఇప్పుడు కూడా కుమారుడి మనసు మార్చాలని అమరావతి రైతులు సీఎం జగన్ తల్లి విజయమ్మను కలిసి రాజధానిపై కొడుకును ఒప్పించాలని వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా కొందరు తమ ప్రయత్నాలు కూడా ప్రారంభినట్లు సమాచారం. రాజధాని రైతులకు విజయమ్మ అపాయింట్ మెంట్ దొరుకుతుందో…. వారి ఆవేదనను ఆ తల్లి అర్ధం చేసుకుని కొడుకును ఒప్పిస్తుందో..? లేదో..? వేచి చూడాలి.