తెలంగాణ ప్రభుత్వం చిత్రసీమకు భారీ నజరానాలు ప్రకటించింది. ఫిల్మ్ ఇనిస్ట్యూట్ ఏర్పాటుకు, సినీ, టీవీ కార్మికులకు స్థలాలు ఏర్పాటు చేస్తామని చిత్రసీమకు హామీ ఇచ్చింది. అంతేకాకుండా పైరసీని అరికడతామని, ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థని పరిపుష్టం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే సింహా అవార్డుల గురించి ఊసే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులనేవి లేనే లేవు. `సింహా` అవార్డు ఇస్తామని ప్రభుత్వం చెప్పినా, అది ప్రకటనలకే పరిమితమైపోయింది. తెలంగాణ ప్రభుత్వం సింహా అవార్డులుఎప్పుడు ఇస్తుంది? అంటూ కొంతమంది నటీనటులు బాహాటంగానే ప్రశ్నించారు. కానీ దానిపై ఎలాంటి సమాధానం లేదు. అవార్డుల ఎంపిక కోసం ఓ కమిటీ వేయడం, అవార్డులు ప్రదానం చేయడం ప్రభుత్వానికేం తలకుమించిన పనేం కాదు.కానీ ఎందుకో మరి అశ్రద్ధ చేస్తోంది. గతేడాదిన నవంబరులో జరగాల్సిన చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనే లేదు. బాలల చిత్రోత్సవానికి హైదరాబాద్ శాశ్వత వేదిక. అయినప్పటికీ ఈ సంబరాలు జరపడానికి ప్రభుత్వం చొరవ చూపలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వీటిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.