ఐటీ సోదాలు… ఈడీ సెర్చింగ్స్.. లాంటివన్నీ… మహా అయితే ఒక్క రోజు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో అయితే.. లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి… రెండు, మూడు రోజులు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలకు సన్నిహితమైన ఓ కంపెనీలో గత ఏడాది వారం రోజుల పాటు సోదాలు జరగడం సంచలనం రేకెత్తించింది. కానీ.. ఓ మామూలు జీఏడి ఉద్యోగి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పీఏగా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో.. ఏకంగా ఐదు రోజుల పాటు సోదాలు జరిగాయి. ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్‌కు చెందిన అధికారులు ఈ సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఐదు రోజుల పాటు జరిగిన సోదాలు.. సోమవారం సాయంత్రం ముగిశాయి. ఐదు రోజుల పాటు సోదాల్లో ఏం దొరికాయి… ఏ అంశాలపై సోదాలు చేస్తున్నారు అన్న విషయాన్ని కనీస మాత్ర సమాచారాన్ని కూడా బయటకు రానివ్వలేదు. భద్రతకు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల్ని కూడా ఉపయోగించుకోలేదు. సీఆర్పీఎఫ్ను తెచ్చుకున్నారు. సోదాలు ప్రారంభించిన రెండో రోజు.. కొన్ని ప్రింటర్లను శ్రీనిాస్ ఇంట్లోకి తీసుకెళ్లారు. మూడవరోజు అధికారులు మరి కొందరు వచ్చి చేరారు. తర్వాత కొందరు వెళ్లిపోయారు. సోదాలు ముగించిన రోజు.. మొత్తం ముగ్గురు అధికారులు మత్రమే ఉన్నారు. వారు తమ వెంట తెచ్చుకున్న లాప్ టాప్ బ్యాగులను మాత్రమే తీసుకెళ్లారు. ప్రత్యేకంగా ఏ వస్తువులూ స్వాధీనం చేసుకోలేదు.
సోదాలు చేసింది.. ప్రభుత్వ ఉద్యోగిపై కాబట్టి ఐటీ, ఈడీ ఎలాంటి అధికారిక ప్రకటన చేసే అవకాశం లేదంటున్నారు. అసలు ఎందుకు సోదాలు చేశారు..? ఏం దొరికాయన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇంకా చెప్పాలంటే.. అసలు సోదాలు చేసిన కేంద్ర దర్యాప్తు విభాగాలేమిటో కూడా స్పష్టత లేదు. అంత గోప్యత పాటించారు. అయితే.. పెండ్యాల శ్రీనివాస్ చంద్రబాబు వద్ద చాలా కాలం పాటు పని చేయడంతో.. కొన్ని మీడియా సంస్థలు రకరకాల రూమర్లు పుట్టించాయి. ఆయనకు భారీ ఎత్తున ఆస్తులన్నాయని.. అక్రమాలు బయట పడ్డాయని ప్రచారం చేశాయి. అలాంటివి ఏమైనా ఉంటే… అరెస్ట్ చేయడమో…అధికారికంగా ప్రకటించడమో చేసి ఉండే వారు కదా.. అన్న అనుమానం కూడా.. సామాన్యుల్లో వస్తోంది. మొత్తానికి చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో సోదాలు మాత్రం.. కాస్త కలకలం సృష్టించాయి.