ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ప్రజాప్రతినిధులందరి భద్రతను ప్రభుత్వం తొలగించింది. భద్రతను కోల్పోయిన వారంతా.. టీడీపీ నేతలే. ఫ్యాక్షన్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని నేతలకూ.. భద్రత దక్కలేదు. ఉదయమే హుటాహుటిన ఆదేశాలు జారీ చేసి.. మధ్యాహ్నానానికి గన్మెన్లందరినీ.. ఆయా పోలీస్ స్టేషన్లలో రిపోర్టే చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల నేతలు
కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి కూడా.. భద్రత తొలగించారు. మాజీమంత్రులు, దేవినేని ఉమ, ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, భూమా అఖిలప్రియ, జీవీ ఆంజనేయులు, యరపతినేని వంటి వారికీ సెక్యూరిటీ మాయం అయింది. స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆదేశాలతోనే భద్రత తొలగించామని పోలీసులు చెబుతున్నారు.
భద్రత తొలగించిన వారెవరికి ముప్పు లేదని.. పోలీసులు చెబుతున్నారు. పల్నాడులో సున్నిత ప్రాంతమైన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి కూడా ప్రభుత్వం రక్షణ తొలగించింది. గతంలో.. రెండు, మూడు సార్లు ఆయనపై హత్యాయత్నం కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. టీడీపీ నేతలు ధైర్యంగా .. గ్రామాల్లో పర్యటించకుడా.. భయ పెట్టే ఉద్దేశంతోనే ప్రభుత్వం.. ఈ భద్రతను తొలగించిందనే ఆరోపణలను టీడీపీ నేతలు చేస్తున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా భద్రత తొలగించారని మండి పడుతున్నారు. గతంలో తనపై నక్సల్స్ దాడి జరిగినప్పుడు భద్రత పెంచారని.. ఇప్పుడు ఎలాంటి సమాచారం లేకుండా భద్రత ఉపసంహరించారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినవారిని జగన్ వెంటాడుతున్నారని ఆరోపించారు. పలువురు టీడీపీ నేతలు కూడా… తమపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అయినా… మాజీ ప్రజా ప్రతినిధులు అయినా వారి భద్రతను ఎప్పుడూ రాజకీయ కోణంలో చూడలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు సహా ప్రతి ఒక్క టీడీపీ నేత భద్రతను తగ్గించడమో.. తొలగించడమో చేశారు.