ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హఠాత్తుగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం..రోజుల తరబడి చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. రేపు సాయంత్రం.. రావాలని.. ఆయనకు పీఎంఓ నుంచి సమాచారం వచ్చింది. దాంతో ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకున్నారు. అయితే.. రేపు మంత్రివర్గ సమావేశం ఉంది. పదమూడో తేదీన జరగాల్సిన మంత్రివర్గ భేటీని .. అత్యవసరంగా.. పన్నెండో తేదీకి మార్చుకున్నారు. మూడు రాజధానుల కోసం… శాసనమండలిని ప్రోరోగ్ చేసి… ఆర్డినెన్స్ ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ లోపే… ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారయినట్లుగా సమాచారం రావడంతో… ఢిల్లీకి బయలుదేరాల్సి వస్తోంది.
ఉదయం… కేబినెట్ భేటీని వీలైనంత త్వరగా పూర్తి చేసి.. జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. హోంమంత్రి అమిత్ షాను కూడా కలవాలని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయన అపాయింట్మెంట్ ఖరరాయిందో లేదో క్లారిటీ లేదు. గతంలో జగన్మోహన్ రెండు సార్లు ఢిల్లీకి వెళ్లారు. అపాయింట్మెంట్లు దొరకక.. వెయిట్ చేసి..చేసి ఢిల్లీకి తిరిగి వచ్చారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటి నుండి… ప్రధాని మోడీకి స్వయంగా ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నారు. అప్పట్నుంచి… అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే.. ఇప్పటికి దొరికినట్లుగా తెలుస్తోంది.
మూడు రాజధానులపై మోడీ సానుకూలంగా స్పందిస్తే..ఆ నిర్ణయాన్ని శరవేగంగా ఎదురు లేకుండా జగన్ అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. మోడీని .. శాసనమండలిని కూడా.. వీలైనంత త్వరగా రద్దు చేయాలని జగన్ కోరే అవకాశం ఉంది. యధావిధిగా వీటితో పాటు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేకహోదా గురించి కూడా… మోడీని జగన్మోహన్ రెడ్డి అడుగుతారు.