కర్నూలులో సుగాలి ప్రీతి అనే విద్యార్థిని అనుమానాస్పద మృతి విషయంలో పవన్ కల్యాణ్ పోరాటం ప్రారంభించకుండానే పోలీసులు దిగి వచ్చారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరం లేదని.. నివేదికను డీజీపీకి పంపించామని కర్నూలు ఎస్పీ ఫకీరప్ప పవన్ కల్యాణ్ పర్యటనకు ఒకరోజు ముందు ప్రకటించారు. అంతే కాదు.. సుగాలి ప్రీతి కేసులో మరోసారి దర్యాప్తు చేస్తున్నామని… అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా దర్యాప్తు సాగుతోందన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని దళిత సంఘాలు కోరుతున్నాయని .. సీబీఐ దర్యాప్తునకు హోంశాఖకు ప్రతిపాదనలు పంపించామన్నారు. సీబీఐ విచారణ అంశం కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఉందని చెప్పుకొచ్చారు.
2017లో జరిగిన ఈ సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి వ్యవహారం.. పవన్ కల్యాణ్ పోరాటంతోనే మరోసారి హైలెట్ అవుతోంది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్. మధ్యాహ్నం మూడు గంటలకు కర్నూలు రాజ్ విహార్ సెంటర్ నుంచి కోట్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహిస్తారు. కోట్ల సర్కిల్ వద్ద బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. విద్యార్థిని సుగాలి ప్రీతిపై అత్యంత ఘోరంగా అత్యాచారం చేయడమే కాదు.. ప్రాణాలు తీశారని పవన్ కల్యాణ్ గతంలో చెప్పారు.
సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో.. ఆయనే నేరుగా ఆందోళన బాట పట్టారు. ఇప్పుడు ప్రభుత్వం స్పందించింది. సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కర్నూలు జిల్లా పర్యటనలో కొంత మంది ప్రభుత్వ బాధితుల్ని కూడా పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు.