శానమండలిలో ఉండిబోయిన బిల్లుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. సెలక్ట్ కమిటీకి వెళ్లనే లేదని ప్రభత్వం కొత్త వాదన వినిపిస్తోంది. అంతే కాదు.. అసలు నిబంధనల ప్రకారం బిల్లులు పాస్ అయిపోయాయని.. గవర్నర్‌కు పంపేస్తామని చెబుతోంది. కానీ టీడీపీ మాత్రం… సెలక్ట్ కమిటీని వేయకుండా మండలి కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని.. ఆయనపై మండలి ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.
బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లకుండా వెనక్కి తెచ్చుకోవాలని ప్రభుత్వం పట్టుదల..!
సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు ప్రస్తుతం శాసనమండలిలో ఉన్నాయి. ఇప్పుడు… ఆ బిల్లుల్ని వెనక్కి తేవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. లేకపోతే… మూడు రాజధానులపై ముందుకెళ్లలేని దుస్థితి. అందుకే శాసనసమండలిని కూడా రద్దు చేసేశారు. దాన్ని కేంద్రం ఏం చేస్తుందో తెలియడం లేదు. బడ్జెట్ మొదటి విడత సమావేశాలు కూడా ముగిశాయి. ఇప్పుడు ఆర్డినెన్స్ ఇద్దామంటే… బిల్లులు అసెంబ్లీలోనో… మండలిలోనే ఉంటే ఆర్డినెన్స్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. ఆర్డినెన్స్ ఇద్దామని ప్రయత్నించినా.. న్యాయనిపుణులు వద్దనడంతో ఆగిపోయారు. ఏ విధంగా చూసినా బిల్లులు ఇరుక్కుపోయాయి. దీంతో శాసనమండలి నుంచి ఆ బిల్లుల్ని బయటకు తేవడానికి ప్రభుత్వం ఎంచుకున్న మార్గం .. అసలు ఆ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని వాదించడం.
మండలి ధిక్కరణ కింద చర్యలు తప్పవని టీడీపీ హెచ్చరికలు..!
శాసనమండలి చైర్మన్ రూలింగ్ ఇచ్చిన విషయం స్పష్టమైన తర్వాత ప్రభుత్వం దాన్ని హైకోర్టులో చెప్పిన తర్వాత… స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చైర్మన్ వీడియో ప్రదర్శించి… శాసనమండలికి పంపారని తేల్చిన తర్వాత.. అధికార పార్టీ ఇలాంటి కాస్త ఆలస్యంగా ఈ వాదన ప్రారంభించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. శానసమండలి చైర్మన్.. సెలక్ట్ కమిటీల్ని ప్రకటించారు. కానీ మండలి కార్యదర్శి మళ్లీ పరిశీలించాలంటూ.. చైర్మన్‌కు మళ్లీ విచిత్రం. భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో.. ఓ అసెంబ్లీ స్పీకర్.. లేదా మండలి చైర్మన్ నిర్ణయాన్ని పునంపరిశీలించాలని వెనక్కి పంపిన ఘటన… ఎప్పుడూ జరిగి ఉండదు. సీఎం సంతకం చేసిన ఫైల్‌ను సీఎస్ తిరస్కరించడం లాంటిదే ఇది. కానీ ఆ సాహసం మండలి కార్యదర్శి చేశారు. మండలికి రాజ్యాంగ పరంగా… జ్యూడిషియల్ పవర్స్ ఉంటాయి. మండలి ధిక్కరణ కింద.. మండలి కార్యదర్శిని డిస్మిస్ చేయడానికి.. జైలు శిక్ష విధించడానికి కూడా పవర్స్ ఉంటాయి. వీటిని కోర్టులు కూడా ప్రశ్నించలేవు. అవసరం అయితే… ముఖ్యమంత్రికి కూడా నోటీసులు జారీ చేస్తామని.. టీడీపీ శాసనమండలి సభ్యులు అంటున్నారు.
బిల్లులు పాసైపోయాయని ప్రభుత్వం కొత్త లాజిక్..!
ఇక్కడ దాకా రావడంతో.. ప్రభుత్వం మళ్లీ వ్యూహం మార్చింది.. చైర్మన్ పధ్నాలుగు రోజుల లోపు సెలక్ట్ కమిటీల్ని వేయలేదని.. అందుకే బిల్లు పాసయిపోయినట్లుగా భావించిన గవర్నర్‌కు పంపుతామని కొత్తగా.. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ భిన్న వాదనలు వినిపించిన… అధికార పార్టీ ఇప్పుడు బిల్లు విషయంలో.. కొత్త మార్గాన్ని ఎంచుకోవడంపై టీడీపీ మండి పడింది. మనీ బిల్లుల విషయంలోనే పధ్నాలుగు రోజుల నిబంధన ఉంటుందని ..నిబంధనలు స్పష్టంగా చదువుకోవాలని సలహా ఇస్తోంది. సెలక్ట్ కమిటీ అనే ప్రక్రియకు బిల్లులు వెళ్లకూడదని ప్రభుత్వం పట్టదలగా ఉంది. బిల్లు … ఇప్పుడున్న స్టేజ్ నుంచి వెనక్కి రావడమో.. పాసవడమో జరగాలని కోరుకుంటోంది.
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లు రద్దు విషయంలో.. ప్రభుత్వం, ప్రతిపక్ష మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. గట్టిగా లాగు హైలెస్సా అంటూ.. రెండు వర్గాలు.. బిల్లుల్ని చెరో వైపు పట్టుకుని అటూ ఇటూ లాగుతున్నాయి.. చివరికి ఎవరికి ఏ భాగం మిగులుతుందో మరి..!