ఎన్నికలయేంతవరకు గెలుపు మాదే అంటే గెలుపు మాదే అంటూ రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఉంటాయి. టీవీ డిబేట్ లో ఆయా పార్టీలకు చెందిన అధికార ప్రతినిధులు సవాళ్ళు కూడా విసురుతూ ఉంటారు. తీరా ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాక ఓటమి ఎదురైతే మాత్రం వెంటనే ప్లేటు ఫిరాయించి మరో రకంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఢిల్లీ ఫలితాల అనంతరం కొందరు విశ్లేషకులు టీవీ చర్చలలో మాట్లాడుతూ గతంలో వ్యక్తం చేసిన ధీమా గురించి కాకుండా తమకు ఈ ఫలితాలు ఏ విధంగా సంతోషాన్ని కలిగించాయో చెబుతున్నారు.
ముఖ్యంగా బిజెపి నాయకులు అయితే తమ పార్టీ ఓట్ల శాతం గతంలో 32 శాతం ఉండగా ఈసారి 38.51 శాతానికి పెరిగిందని, ఆ విధంగా చూస్తే ఢిల్లీ ఓటరు బిజెపిని తిరస్కరించ లేదని, ఓట్ల శాతం పెరగడం తమకు సంతోషకరమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పెరిగిన ఓట్ల శాతాన్ని సీట్లు గా మార్చుకో లేకపోయామని, దానిపై పని చేస్తామని అంటున్నారు. 70 సీట్లలో బిజెపి కేవలం 8 సీట్లకే పరిమితం అయిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న మూడు సీట్ల నుండి ఈసారి బిజెపి 8 సీట్ల కి పెరిగింది.
ఇక కాంగ్రెస్ ది మరొక వింత వాదన. తాము ఎన్నికల్లో గెలవలేక పోయినప్పటికీ, బిజెపి ని నిలువరించామని, 240 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు, అమిత్ షా ఇంతమంది కలిసి, అంత ప్రచారం చేసినా కూడా వారికి అధికారం దక్కకుండా చేశామని కాంగ్రెస్ తరపున విశ్లేషకులు టీవీ చర్చలో మాట్లాడుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉండే ఢిల్లీలో బిజెపి చతికిల పడడం తమకు దేశవ్యాప్తంగా కలిసొస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ఓట్ల శాతం గతంలో 22 శాతం ఉంటే ఇప్పుడు 4.26 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ చీల్చక పోవడం కూడా అరవింద్ కేజ్రివాల్ విజయానికి ఒక కారణమని తటస్థ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
మొత్తానికి, విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీ సంతోషంగా ఉంటే, తమ ఓట్ల శాతం పెరిగిందని సీట్లు పెరిగాయి అని బిజెపి సంతోషంగా ఉంటే, బిజెపి దూకుడుకి కళ్లెం పడిందని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో దేశవ్యాప్తంగా ఇది తమ కి కలిసొస్తుందని కాంగ్రెస్ కి సంతోషంగా ఉందట ! బహుశా ఇదేనేమో విన్- విన్ – విన్ సిచువేషన్ అంటే !!