రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో రైతుబంధు ఒకటి. అయితే, ఇప్పుడు రకరకాల కారణాలతో రైతుబంధు సాయానికి కోతలు పెడుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అర్హులైనవారికి పథకం వర్తింపజేయడం లేదనీ, అధికారుల తప్పిదాల వల్ల చాలామందికి ఈ సాయం అందడం లేదని విమర్శిస్తున్నారు. రైతు రుణమాఫీ అమలు, మద్దతు ధరల నిర్ణయం వంటి అంశాలపై కూడా ఇలాంటి విమర్శలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఒక లేఖ రాశారు. రైతుబంధు పథకం కేవలం ఎన్నికల పథకంగా మార్చేశారంటూ విమర్శించారు. రైతు సమన్వయ కమిటీ కూడా కొంతమందికి పునరావాస కేంద్రంగా మారిపోయిందని ఆరోపించారు.
రైతులకు ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చిందనీ, అమలు దగ్గరకి వచ్చేసరికి ఆ ఊపు కనిపించడం లేదనీ, రాబోయే బడ్జెట్లో రైతులకు ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించాలన్నారు. రైతు రుణమాఫీని కూడా ఆర్భాటంగా ప్రారంభించారనీ, దాన్నీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు రేవంత్ రెడ్డి. మద్దతు ధరను ఎప్పట్నుంచీ ప్రకటిస్తారో ముఖ్యమంత్రి చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రైతులకు ఈ ప్రభుత్వం న్యాయం చెయ్యకపోతే వారితో కలిసి త్వరలో తాను ఉద్యమించాల్సి ఉంటుందని లేఖలో రేవంత్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో 58 లక్షల రైతులుంటే, 41 లక్షల మందికి మాత్రమే రైతుబంధు ఆర్థిక సాయం అందుతోంది. ఖరీఫ్, రబీ సీజన్లకు మొదట్లో బాగానే డబ్బులిచ్చారు. ఆ తరువాత, ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా నిధులు విడుదల చేశారు. రబీ సీజన్ చివరికి వచ్చిందనగా అప్పుడు రైతులు ఖాతాల్లో డబ్బులేశారు. అందులోనూ 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకి ఈసారి నిధులు ఇవ్వలేదు! అవి ఎప్పుడు ఇస్తారో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఆలస్యంగా పాస్ బుక్ లు అందుకున్న రైతులకు రైతుబంధు ఇస్తారో లేదో తెలీదు. ఇక, భూముల్ని అమ్ముకున్నవారు, మరణించిన రైతులు పేరుతో చాలామందిని ఈ పథకం నుంచి తొలగించారు. రైతు బీమా అందరికీ వర్తింపజేయడం లేదనీ, ప్రభుత్వం వైఖరి చూస్తుంటే రైతుబంధును ఉంచుతారా తీసేస్తారా అనే అనుమానం కలుగుతోందని రైతు సంఘాల నేతలు అంటున్నారు. ఈ పరిస్థితులను నేపథ్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి ఉద్యమిస్తే రైతాంగం నుంచి మంచి మద్దతు లభించే అవకాశం ఉంది.