తెలంగాణ సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటీషన్లపై హైకోర్టు విచారించింది. ఇప్పటికిప్పుడు సచివాలయం కూల్చి, కొత్తది నిర్మించాల్సిన అవసరం ఏముందంటూ న్యాయస్థానంలో కొన్ని పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇదే అంశమై గతంలో రెండుసార్లు కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఏయే బ్లాకుల్ని కొత్తగా నిర్మిస్తున్నారు, వాటి డిజైన్లేంటి, ఎన్నాళ్లలో నిర్మిద్దామనుకుంటున్నారు ఇలాంటి సమాచారాన్ని కోర్టుకు ఇవ్వాలంటూ గత విచారణలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, అప్పుడూ ఇప్పుడూ కోర్టుకు ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే… సెక్రటేరియట్ కూల్చేద్దామని కేబినెట్ నిర్ణయం తీసుకుంది, కాబట్టి ముందు కూల్చేస్తాం, తరువాత డిజైన్ ఫైనల్ చేస్తాం అని.
ఈ వాదనతో కోర్టు ఆగ్రహించి… ముందుగా కొత్త భవనం ప్లానింగ్ తీసుకుని రండి అంటూ చెప్పింది. డిజైన్, ప్లానింగ్ పూర్తి కానప్పుడు కూల్చివేయడానికి ఎందుకంత తొందర పడుతున్నారు అంటూ ప్రశ్నించింది. కొత్త డిజైన్ తమకు సమర్పించాకనే కూల్చివేతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ముందుగా కూల్చేసి తరువాత డిజైన్ ఇస్తామంటే కుదరదు అని స్పష్టం చేసింది. డిజైన్ చేతిలో లేకుండా కూల్చివేతకు సంబంధించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందంటూ కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ కూల్చివేతలపై ఎలాంటి నిర్ణయాలు వద్దంటూ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
సచివాలయ భవనం కూల్చివేతకు అన్ని ఏర్పాట్లూ దాదాపు అయిపోయాయనే చెప్పాలి. ఇప్పటికే భవనానికి మార్కింగ్ కూడా చేశారు. కూల్చివేతకు యంత్రాంగమంతా సిద్ధమౌతున్న తరుణంలో ఈ ప్రక్రియకు హైకోర్టు తాజా ఆదేశాలతో బ్రేకు పడినట్లయింది. నిజానికి, ఉన్న భవనాన్ని కూల్చేసి కొత్తది నిర్మించాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయం మొదట్నుంచీ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సరిపోయిన సచివాలయం, ఇప్పుడు ఎందుకు సరిపోవడం లేదనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం ఇంతవరకూ లేదు! వందల కోట్ల ప్రజాధనం ఎందుకు వృథా చేస్తున్నారనే విమర్శలు ఎన్ని వినిపిస్తున్నా… ఈ విషయంలో ప్రభుత్వం దూకుడుగానే ముందుకు వెళ్తోంది. వీలైనంత త్వరగా కొత్త భవనం కట్టేయాలన్న పట్టుదలే ప్రతీ దశలోనూ కనిపిస్తోంది. ఇప్పుడు, కోర్టు కోరినట్టుగా డిజైన్ సిద్ధం చేసి ఇచ్చాశాక, తదుపరి ఆదేశాలు ఎలా ఉంటాయో చూడాలి.