తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అమరావతి రాజధాని మార్చేందుకు కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడున్ని దెబ్బతీసేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులను ఆర్థికంగా దెబ్బ కొట్టడం ఒక వైపు, కేంద్రం సాయంతో సీబీఐ, ఇన్ కమ్ టాక్స్ దాడులు వంటివి ముమ్మరం చేయిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తెలుగుదేశం నాయకులను చంద్రబాబుకు దూరం చేయాలని, కేంద్రంలో బీజేపీ పెద్దల సాయంతో చంద్రబాబు నాయుడుపై పగ తీర్చుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్మోహన్ రెడ్డి జరిపిన భేటీలో ఇదే అంశంపై చర్చించినట్లు చెబుతున్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు చేతులు కలిపి తనను జైలుకు పంపించినట్లుగానే ప్రస్తుత బీజెపీ ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు నాయుడుకి చుక్కలు చూపించాలన్నది జగన్ లక్ష్యంగా చెబుతున్నారు. మా ప్రభుత్వంతోనూ, పార్టీతోనూ కలిసి నడవాలని నరేంద్ర మోడీ ఆహ్వానించడం, మీ ఆహ్వానాన్ని గౌరవిస్తామని సీఎం జగన్ చెప్పడం చంద్రబాబు నాయుడు పై కక్ష సాధింపు లో భాగమేనని అంటున్నారు. రాజధాని తరలింపు, శాసన మండలి రద్దుతో పాటు చీటికీ మాటికీ తనకు అడ్డు వస్తున్న సీబీఐ,హైకోర్టు వంటి వాటిని నియంత్రించడం కోసం ప్రధానితో చేతులు కలపాలన్నది సీఎం జగన్ వ్యూహరచన గా చెబుతున్నారు. ఇప్పటికే క్విడ్ ప్రోకోలో విశేష అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డి “ మీకు ఇది చేస్తా… నాకు మీరు ఇది చేయండి” అని ప్రధాని వద్ద ప్రతిపాదన చేసినట్లు పార్టీలో అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.