ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పరాజయం భారతీయ జనతా పార్టీకి తీరని వేదనని కలిగిస్తోంది. దేశ రాజధానిలో పరాజయం పాలు కావడం ఆ పార్టీ సీనియర్లకు మింగుడు పడడం లేదు. ఢిల్లీ ఇంట గెలిస్తే భారత బయట రచ్చ చేయవచ్చునన్న తమ కల నెరవేరలేదని కమలనాధులు కలవరపడుతున్నారు. ఈ పరాజయానికి కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు బీజేపీ నాయకులు. ఎనిమిది నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న ఏడు లోక్ సభ స్ధానాలను గెలుచుకున్న బీజేపీ శాసనసభ ఎన్నికల్లో పూర్తి డీలా పడిపోవడం వెనుక కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు అగ్రనేతలు.
ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం కైవసం చేసుకోవాలనే ఆత్రుతలో తొందరపాటు చర్యలు తీసుకున్నామా అనే ఆలోచనలు చేస్తున్నారు.ప్రత్యర్ధి బలాన్ని అంచనా వేయడంలో తడబాటు పడ్డామని కొందరు నాయకులు, ప్రచారంతో పాటు వ్యూహ రచనలోను అతి చేశామని ఇంకొందరు నాయకులు అంటున్నారు. “మేం ప్రచారంలో చాలా ఎక్కువ చేశాం. ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్యకర్తలను తీసుకువచ్చి మోహరించాం.
ఎన్నికల వాతావణాన్ని యుద్ధ వాతావరణంగా మార్చేసాం. ఇదే మమ్మల్ని దెబ్బతీసింది” అని పేరు వెల్లడించేందుకు అంగీకరించని తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ప్రత్యర్ధుల బలాన్ని చాలా తక్కువగా అంచనా వేశామని, ఇంటింటి ప్రచారాన్ని ఎన్నికల ముందు ప్రారంభించడం కూడా ఓ తప్పిదమేనని బీజేపీ నాయకులు అంటున్నారు.
అధికారంలో ఉన్న కేజ్రీవాల్ అభివ్రద్ధి కార్యక్రమాలే తన అస్త్రంగా చేసుకున్నారని, భారతీయ జనతా పార్టీ మాత్రం ఢిల్లీకి సంబంధం లేని అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోవడం వల్లే దెబ్బ తిన్నామనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే చేతులెత్తేయడానికి కారణాలను విశ్లేషించుకుని ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని కూడా కమలనాధులు అంటున్నారు. “కాంగ్రెస్ పార్టీకి తమ ఓటమి ముందే తెలిసిపోయింది. అందుకే వ్యూహాత్మకంగా తాము ఆప్ కోసం త్యాగం చేస్తున్నామంటూ ప్రకటించి సేఫ్ జోన్ లోకి వెళ్లింది. మేం అతి విశ్వాసాన్ని ప్రదర్శించి ఓటమి తెచ్చుకున్నాం” అని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికలు భవిష్యత్ లో జరిగే రెండు మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు గుణపాఠం వంటివని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇక ముందు భారమంతా ఒకరిద్దరిపైనే వేయకుండా ఆయా రాష్ట్రాల అగ్రనాయకత్వంతో చర్చించి వ్యూహ రచన చేయాలన కూడా కమలనాధుల ఆలోచనగా తెలుస్తోంది.