తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… ఓ వ్యూహకర్తను నియమించుకున్నారు. ఆయన పేరు రాబిన్ శర్మ. ఆయన తన బృందంతో ఇప్పటికే రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పని కూడా ప్రారంభించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రాబిన్ శర్మ గతంలో నరేంద్రమోడీ ప్రచార వ్యవహారాలను చూసుకున్నారు. ప్రస్తుతం దేశంలో నెంబర్ వన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ తో కలిసి.. ఈ రంగంలోకి అడుగు పెట్టారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వంటి సంస్థలకు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. ఆయన పనితీరును కొద్ది రోజుల పాటు పరిశీలించిన తర్వాత వచ్చే నాలుగేళ్ల వరకూ వినియోగించుకోవాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోమూడు రాజధానుల ప్రకటన, కులపరమైన రాజకీయల విభజన పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్న రాబిన్ శర్మ టీం… ఈ నెలాఖరుకు.. ఓ మధ్యంతర నివేదికను చంద్రబాబుకు ఇస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వాటితో పాటు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..సోషల్ మీడియా ప్రచారాన్ని ఏ కోణంలో చేయాలి.. ఎలా ముందుకెళ్లాలనన్న సలహాలు కూడా రాబిన్ శర్మ ఇస్తారని అంటున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి కలిగించే ప్రధాన అంశాలపై.. ఈ రాబిన్ శర్మ టీం ప్రధానంగా దృష్టి సారిస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయ వ్యూహాల్లో పండిపోయిన చంద్రబాబునాయుడు .. ఇతరుల సలహాలు తీసుకోవాలన్న ఆలోచన చేయడం అనూహ్యమేనని టీడీపీ వర్గాలంటున్నాయి. అయితే.. చంద్రబాబు ఎవరు ఏమి చెప్పినా వింటారు.. చివరకు తాను చేయాలనుకున్నదే చేస్తారని.. టీడీపీ వర్గాలు అంటూంటాయి. ఈ క్రమంలో రాబిన్ శర్మ బృందాన్ని క్షేత్ర స్థాయి పరిస్థితుల పరిశీలన… సోషల్ మీడియా క్యాంపైన్ ప్లాన్ చేసుకోవడానికి ఎక్కువగా వినియోగించుకుంటారని అంటున్నారు. ఈ రాబిన్ శర్మ బృందానికి నాలుగున్నరేళ్లకు పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు.. ఒప్పందం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.