ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… మంత్రివర్గ సమావశంలో ఓ ఎన్బీఎఫ్సీని ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఎన్బీఎఫ్సీ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అన్నమాట. ప్రైవేటు రంగంలో ఈ తరహా వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా బుల్స్, టాటా క్యాపిటల్, ఫులర్టన్ ఇండియా, టాటా క్యాపిటల్, డీహెచ్ఎఫ్ఎలాంటి… లాంటి సంస్థ ఈ ఎన్బీఎఫ్సీ కేటగిరీలోకి వస్తాయి. ఇవి ఆర్థిక సేవలు అందిస్తాయి కానీ.. బ్యాంకుల తరహాలో కాదు. ఇవి బల్క్‌గా రుణాలు తీసుకుని… ప్రజలకు హోమ్లోన్లు వంటివి రీటైల్‌గా ఇస్తాయి. వీటిని ప్రారంభించడానికి ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఓ పద్దతి ప్రకారం నిర్వహించాలి. ఆర్బీఐకే జవాబుదారీగా ఉండాలి. అయితే.. ఇలాంటి ఓ ఎన్బీఎఫ్సీని ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే చాలా మందిని ఆశ్చర్య పరిచింది.
అప్పుల సమీరణకు ఏపీ బ్రాండ్ “ఎన్బీఎఫ్సీ”..!
ఏపీ సర్కార్ ప్రత్యేకంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థను ప్రారంభించాలని నిర్ణయించడానికి కారణం… దాని ద్వారా.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమో… రుణాలు అందించి.. వారిని పైకి తెచ్చే ప్రయత్నమో చేయడానికి కాదు. స్వయంగా అప్పులు చేసుకోవడానికి. తాను ప్రారంభించాలనుకుంటున్న కంపెనీని ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని పేరు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. అప్పులపైనే ఆధారపడుతోంది. వస్తున్న ఆదాయానికి చేస్తున్న అప్పులకు పొంతన లేకపోవడం.. ఇప్పుడు ఆ అప్పులు కూడా పుట్టడం లేదు. అందుకే.. రుణాల కోసం.. కొత్తగా చేసిన ఆలోచన ఈ ఎన్బీఎఫ్సీ. ఆఫ్ బడ్జెట్ బారోయిరగ్ విధానం ద్వారా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అప్పులు చేయిస్తున్న ప్రభుత్వం.. వాటిని అప్పు చేసిన ఉద్దేశానికి కాకుండా.. తాను వాడుకోవడానికి.. ఈ విధానాన్ని ఉపయోగించుకుకోబోతోంది.
ప్రతీ శాఖ.. ఆలయాల సొమ్ము కూడా ఎన్బీఎఫ్సీ ఖాతాలోకే..!
అలాగే.. ఏపీ సర్కార్‌కు ప్రతి ప్రభుత్వ శాఖకు చెందిన నిధుల్ని… ఏక మొత్తంగా చేసి… ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేసుకునే సౌకర్యాన్ని కూడా.. ఈ సంస్థ ద్వారా కల్పించుకోవాలని నిర్ణయించుకుంది. వివిధ శాఖల్లో, కార్పొరేషన్లలో ఉండిపోయిన నిధులన్నింటినీ.. ఈ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కు తరలిస్తారు. వాటిని వివిధ ఆర్థిక సంస్థలకు వడ్డీలకు ఇస్తామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు కానీ అసలు చాలా శాఖల వద్ద రోజువారీ నిర్వహణకే నిధుల్లేవు. ఇక వడ్డీలకు ఇచ్చేంత ఎక్కడ ఉంటాయి. ఈ శాఖలకు వచ్చే ఆదాయాన్ని కూడా… తీసుకుని.. సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడమే ప్రధాన ఉద్దేశమన్న చర్చ జరుగుతోంది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న ఆర్థిక సంస్థ ద్వారా యూనివర్శిటీలు, కార్పొరేషన్లు, దేవాదాయ శాఖ ఆలయల సొమ్ము కూడా.. వాడుకునే ప్లాన్ అమలు చేస్తున్నారు. అంటే.. ప్రత్యక్షంగా అయినా.. పరోక్షంగా అయినా ప్రభుత్వానికి వచ్చే ప్రతీ రూపాయిని.. ముఖ్యమంత్రి తన విచక్షణ ప్రకారం వాడుకునే అవకాశం కల్పించడమే ఈ ఎన్బీఎఫ్సీ ఉద్దేశం.
ఆర్బీఐ పర్మిషన్ వస్తేనే ప్రారంభం..!
అయితే.. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరే్షన్ ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. కొద్ది రోజుల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆర్బీఐ ఇంత వరకూ పర్మిషన్ ఇవ్వలేదు. అయితే.. మంత్రివర్గ సమావేశంలో మాత్రం నిర్ణయం తీసేసుకున్నారు. ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ముందడుగు వేయాలి. ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.