ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తనకు జీతం చెల్లించడం లేదని.. ఇప్పుడు నిరాధారణ ఆరోపణలతో సస్పన్షన్ వేటు వేశారని ఆరోపిస్తూ.. ఏపీకి చెందిన డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ క్యాట్‌లో పిటిషన్ వేశారు. చంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం మారిన తర్వాత పోస్టింగ్ ఇవ్వలేదు. ఎనిమిది నెలల పాటు ఆయనను ప్రభుత్వం ఖాళీగానే ఉంచింది. ఐదు రోజుల కిందట హఠాత్తుగా.. ఆయన ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఓ నిఘా పరికరం కొనుగోలు విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ.. సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు.. క్యాట్‌లో పిటిషన్ వేశారు.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే.. తనపై నిరాధార ఆరోపణలు చేసి… సస్పెన్షన్ వేటు వేశారని.. తక్షణం సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలని… ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌లో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. తన సస్పెన్షన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడంతో.. ఏబీ వెంకటేశ్వరావు క్యాట్ ను ఆశ్రయించడం ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే.. ఆయనకు.. గత ఎనిమిది నెలలుగా జీతం ఇవ్వలేదని.. క్యాట్‌కు చెప్పడమే అధికారవర్గాల్లో సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వనప్పుడు… వీఆర్ లో ఉంచినప్పటికీ జీతం చెల్లించాల్సి ఉంది. సస్పెన్షనో.. మరో తీవ్రమైన కారణమో ఉంటే తప్ప.. జీతం నిలిపివేయడానికి అవకాశం లేదు.
కానీ.. ఏబీ వెంకటేశ్వరారవు విషయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత నెల నుంచే.. జీతం ఆగిపోయింది. మే 30న జగన్ పదవీ ప్రమాణం చేశారు. ఆ నెల జీతం ఏబీ వెంకటేశ్వరరావు అందుకున్నారు. ఆ తర్వాత జూన్ నుంచి ఆయనకు జీతం కూడా ఇవ్వడం లేదు. అప్పట్లో సస్పెన్షన్ వేటు కూడా వేయలేదు కాబట్టి.. జీతం ఆపడానికి అవకాశం లేదు. అందుకే.. తనపై కక్ష సాధింపు కోసమే.. ఈ చర్యలు తీసుకున్నారని.. ఏబీ ..ప్రత్యేకంగా జీతం విషయాన్ని పిటిషన్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.