ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇద్దరూ గంటో, గంటన్నరో చర్చలు జరిపారు. ఆ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో తెలీదు కానీ ఆ భేటీ జరిగిన 24 గంటల లోపే ఆదాయ పన్ను శాఖ తన పని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల తాము జరిపిన ఆదాయ పన్ను దాడులపై ఓ ప్రకటన విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యక్తిగత కార్యదర్శితో సహా పలువురు తెలుగుదేశం నాయకుల కార్యాలయాల పైనా, ఇళ్లపైనా దాడులు చేసినట్లుగా ఐటీ శాఖ ప్రకటించింది. చట్టం తన పని తాను చేస్తుందని దేశ, రాష్ట్ర అధినేతలు పైకి చెప్పినా.. చట్టం వెనుక అధికార చుట్టం ఉంటుందని ఐటీ శాఖ ప్రకటనతో వెల్లడ్యయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పైనా, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని పేరు తెచ్చుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐటీ శాఖ చర్యతో దానిని నిజం చేసినట్లుగానే కన్పిస్తోందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. తాము ఎవరిపై దాడులు చేసామో ఐటీ శాఖ పేర్లు వెల్లడించకపోయినా ఎవరెవరిపై దాడులు జరిగాయో ప్రపంచానికి తెలిసిపోయింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒక్కటై పోయారనే వార్తలు వస్తున్నాయి. తమకు మద్దతు ఇవ్వాలని,తమ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించిన్నట్లుగానే కనిపిస్తోంది. ఈ పరస్పర అంగీకార నేపథ్యమే ఐటీ శాఖ చేసిన దాడుల ప్రకటనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే నిజమైతే తెలుగుదేశం పార్టీ అధినేతకు కష్టాలు ప్రారంభం అయినట్లేనని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.