ఆంధ్రప్రదేశ్ లో స్ధానిక పోరుకు రంగం సిద్ధం అవుతోంది. మార్చి నెల 15 వ తేదీ నాటికి అన్ని స్ధానిక సంస్థలకు ఎన్నికలు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్, పంచాయితీ… ఇలా అన్ని స్ధానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్ర్రంపై పూర్తి పట్టు సాధించాలన్నది అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వ వ్యతిరేకతను చూపించాలని తహతహలాడుతోంది. ముఖ్యంగా మూడు రాజధానులకు ప్రజలు వ్యతిరేకమని స్థానిక ఎన్నికల్లో విజయం ద్వారా నిరూపించాలన్నది తెలుగుదేశం పార్టీ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఈ ప్రాంతాల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుని అక్కడి ప్రజలు రాజధానికి వ్యతిరేకమని ప్రపంచానికి చాటాలన్నది తెలుగుదేశం పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ వీలైనన్ని ఎక్కువ మున్సిపాల్టీలు, పంచాయతీలను కైవసం చేసుకోవాలని, దీని ద్వారా అక్కడి ప్రజలు పాలన రాజధానిగా తమ ప్రాంతానికి వ్యతిరేకమని ప్రభుత్వానికి చెప్పాలన్నది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ఎత్తుగడగా చెబుతున్నారు. అలాగే రాయలసీమలో కూడా వీలైనన్పి ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా వ్యూహ రచన చేయాలని చంద్రబాబు నాయుడు ఆ ప్రాంత నాయకులకు సూచించినట్లు చెబుతున్నారు. క్రిష్ణ, గుంటూరు జిల్లాలతో పాటు ఆ పక్కనే ఉన్న ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తమకు అనుకూలంగా తీర్పు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో కూడా స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటితే అది ప్రభుత్వ వ్యతిరేకతగా ప్రపంచానికి చూపించవచ్చునన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్ధానికంగా చురుకుగా ఉన్న వారిని అభ్యర్ధులుగా ఎంపిక చేయాలని ఇప్పటికే స్ధానిక తెలుగుదేశం నాయకులను ఆదేశించినట్లు చెబుతున్నారు.
రాజధాని జిల్లాలపై “ఫ్యాన్” గుర ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో తమకు తిరుగులేని విజయం వస్తుందని అధికార వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా ఉంది. దీనికి కారణం రాజధానులను ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడమేనని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇక రాజధాని అమరావతి ఉన్న రెండు జిల్లాల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్ధానాలు కైవసం చేసుకుని ఇక్కడి ప్రజలు కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్పారని తెలుగుదేశం పార్టీకి తెలియజేయాలన్నది సీఎం వ్యూహంగా చెబుతున్నారు. ఇందుకోసం ఈ రెండు జిల్లాల నాయకులతో ఎప్పటికప్నుడు చర్చలు జరపాలనా పార్టీ సీనియర్ నాయకులను ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు రాజధాని అంశం చుట్టూనే తిరిగేటట్టుగానే కనిపిస్తోంది.