తెలుగు360 రేటింగ్: 2.5/5
ప్రేమలో ఓ దైవత్వం ఉంది.
ప్రేమలో త్యాగం ఉంది.
అంతెందుకు… ప్రేమలో సమస్త సృష్టే వుంది.
అందుకే ప్రేమ కథలు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని గాథలు చూపించినా – ఎక్కడో చోట సరికొత్త ప్రేమ విత్తనం మొలకెత్తుతూనే ఉంటుంది. అందుకే ప్రేమకథల ప్రేమలో పడుతుంటారు దర్శకులు. క్రాంతి మాధవ్ కూడా ప్రేమలో పడ్డాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో. తన అదృష్టం ఏమిటంటే… ఒకే సినిమాలో మూడు ప్రేమకథలు చూపించే అవకాశం రావడం. ఒకే సినిమాలో మూడు రకాల ప్రేమికుల పాత్రలో కనిపించే అవకాశం విజయ్ దేవరకొండకు దక్కింది. మరి వీరిద్దరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారా?? ప్రేమని, ప్రేమలోని గాఢతనీ, స్వచ్ఛతనీ, దైవత్వాన్నీ, త్యాగాన్నీ…. ఏ రూపంలో చూపించారు? ఎంత మోతాదులో చూపించారు..?
కథ
గౌతమ్ (విజయ్ దేవరకొండ) రచయిత కావాలని తపన పడుతుంటాడు. అందుకే ఉద్యోగాన్ని కూడా వదిలేసి… పెన్నూ, పేపరూ పట్టుకుంటాడు. అయితే… యేడాదిన్నర ఇంట్లో కూర్చున్నా ఒక్క అక్షరం కూడా రాయడు. తన రొటీన్ లైఫ్‌నీ, బోరింగ్ యాటిట్యూడ్‌ని చూసి భరించలేకపోతుంది యామిని (రాశీఖన్నా). ఇంట్లోవాళ్లని, కోట్ల రూపాయల్ని సైతం కాదనుకుని గౌతమ్ తో సహజీవనం చేస్తుంటుంది. గౌతమ్ నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతుంది. ఆ బాధలోనే గౌతమ్‌లోని రచయిత బయటకు వస్తాడు. కథలు రాయడం మొదలెడతాడు. ఆ కథల్లో ప్రేమ, త్యాగం, దైవత్వం అన్నీ ఉంటాయి. అవన్నీ తనలోని ఫీలింగ్స్కావని, ఆ ఫీలింగ్స్‌కి మూలం… యామినితో తనకున్న ప్రేమ అని గ్రహిస్తాడు. మళ్లీ యామినికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు. మరి ఆ ప్రయత్నం ఎంత వరకూ సఫలీకృతం అయ్యింది. ఇంతకీ… గౌతమ్ రాసిన ఆ ప్రేమ కథలు ఎవరివి? ఆ కథలు గౌతమ్‌లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చాయి? అనేదే కథ.
విశ్లేషణ
క్రాంతి మాధవ్ మంచి లైన్ ఎంచుకున్నాడు. ఓ ప్రేమికుడి బాధలోంచి… కొన్ని కథలు పుట్టుకురావడం, ఆ కథల్లో ఆ ప్రేమికుడే కనిపించడం మంచి ఆలోచన. తన రైటింగ్ స్కిల్స్‌నీ, హీరోలోని యాక్టింగ్ టాలెంట్‌నీ పూర్తి స్థాయిలో బయట పెట్టే అనువైన వేదిక దొరికింది. ఇక.. పెన్నూ, పేపరూ పట్టుకుని రెచ్చిపోవడమే తరువాయి.
కాకపోతే… కొన్ని సార్లు మంచి ఆలోచనలు – దారి తప్పుతుంటాయి. ఆలోచనలో కనిపించిన వైవిధ్యం ఆచరణలో కనిపించదు. `వరల్డ్ ఫేమస్ లవర్` విషయంలోనూ అదే ఎదురైంది. ఒకే కథలో మూడు ప్రేమకథలు చూపించాలనుకున్నాడు దర్శకుడు. కానీ ఆ మూడూ ఎలాంటి కథలు, ఎలాంటి వాతావరణంలో సాగే కథలు, అందులో ఎంత పెయిన్ ఉంది? ఎంత ప్రేమ చూపించాలి? అనే విషయంలో మాత్రం రాజీ పడిపోయాడు. కొత్తగా ఆలోచించలేకపోయాడు.
ముందుగా ఇల్లందు ప్రేమకథ చూద్దాం. ఇది ప్రేమ కథ కాదు. ఓ పెళ్లి కథ, భార్యా భర్తల కథ. శీనయ్యకు తన పెళ్లాం సువర్ణ అంటే నిర్లక్ష్యం ఎక్కువ. పెద్దగా చదువుకోలేదన్న చులకన. పైగా నల్లగా ఉంటుందన్న భావన. అందుకే… తనతో పాటు పనిచేసే అందమైన, చదువుకున్న, మాంచి రంగున్న స్మిత తో సాన్నిహిత్యం కోరుకుంటాడు. తన స్నేహాన్ని ఆస్వాదిస్తాడు. భర్తకు దూరమైపోతున్న బాధని ఓర్చుకుంటూ, భర్తని తన దారిలో తెచ్చుకోవడానికి సువర్ణ ఏం చేసిందన్నదీ ఇల్లందు ఎపిసోడ్లో కనిపిస్తుంది. – ప్రేమలో సర్దుకపోవడం అనే లక్షణాన్ని ఇక్కడ హైలెట్ చేద్దామనుకున్నాడు క్రాంతి మాధవ్. అయితే.. ఆ విషయం చివర్లో హీరో డైలాగుల రూపంలో చెబితే గానీ, ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వదు. ఇల్లందు కథలో.. శీనయ్యగా విజయ్ క్యారెక్టరైజేషన్, ఐశర్య అత్యంత సహజమైన నటన, తెలంగాణ యాసలో చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. వాటిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ.. సోల్‌కి మాత్రం కనెక్ట్ అవ్వరు. ఏం రాసినా, అందులో ఆత్మ ఉండాలి.. అని బల్లగుద్ది గౌతమ్ క్యారెక్టర్‌తో చెప్పించిన దర్శకుడు ఆ ఆత్మని ఇక్కడ పట్టుకోలేకపోయాడు.
ఇక రెండో కథ విషయానికొద్దాం. పారిస్‌లో జరిగే ప్రేమకథ ఇది. ఓ పైలెట్ కీ, గౌతమ్ కీ మధ్య జరిగే కథ. రేడియో జాకీగా గౌతమ్ లైఫ్ స్టైల్, పారిస్ కల్చర్ చూపించే ప్రయత్నం చేశారు ఈ కథలో. ప్రేమలోని `త్యాగం` ఎలా ఉంటుందో చూపించేందుకు దర్శకుడు ఈ ఎపిసోడ్‌ని వాడుకున్నాడు. అయితే ఆ త్యాగం మరీ కృతకంగా, కృత్రిమంగా ఉంది. కథానాయిక కళ్లు పోతే… కథానాయకుడు తన కళ్లని దానం చేస్తాడు. ఇది ఎప్పటి ప్రేమకథ..? ఓ బతికున్న మనిషి రెండు కళ్లనీ మరొకరికి దానం చేయడం ఏ వైద్య శాస్త్రం ఒప్పుకోదు. `ఇది కేవలం కథ మాత్రమే.. రచయిత ఇష్టం వచ్చినట్టు రాసుకున్నాడంతే..` అనుకుంటే మనం ఏమీ చేయలేం. త్యాగం చాలా గొప్పది. ఆర్థ్రత గలది. దాన్ని ఇంత సాదాసీదాగా చూపించి, ఆడియన్స్‌ని ఫీల్ అవ్వమంటే ఎలా…? పైగా గౌతమ్ – యామినీ కథకూ, ఈ కథకూ కొన్ని పోలికలు కనిపిస్తాయి. గౌతమ్ యామిని కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేస్తాడు. ఇక్కడ తన కళ్లని త్యాగం చేస్తాడు. అంతే తేడా.
మూడో కథ.. అత్యంత ముఖ్యమైన కథ. గౌతమ్ – యామినిలది. గౌతమ్, యామిని విడిపోవడం దగ్గర్నుంచే ఈ సినిమా మొదలవుతుంది. వాళ్లిద్దరూ విడిపోయాక.. అప్పుడు ప్రేమకథ చూపించడం, వాళ్లెంత గొప్ప ప్రేమికులో వివరించే ప్రయత్నం చేయడం బెడసి కొట్టింది. యామిని ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. గౌతమ్ ఎప్పుడూ `యామిని యామిని` అంటూ అరుస్తూనే ఉంటాడు. ఈ ఎపిసోడ్లో అర్జున్ రెడ్డి ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి… అని ప్రేక్షకుడు భావిస్తే అది తన తప్పు కాదు. త్యాగం, సర్దుకుపోవడం అనే లక్షణాలు ప్రేమకు ఆపాదించిన దర్శకుడు అవి రెండూ యామినిలో ఉన్నాయన్న విషయాన్ని బలంగా మనసుకి హత్తుకునేలా చెప్పలేకపోయాడు. గౌతమ్ – యామినిల ఫ్లాష్ బ్యాక్ కూడా అంత ఇంపాక్ట్ గా, యంగేజింగ్‌గా అనిపించదు. చివర్లో వాళ్లిద్దరూ కలవడం అత్యంత సినిమాటిక్‌గా ఉంది.
జీవితంలో బ్యాక్ స్పేస్ ఉండదు, వెనక్కి వెళ్లి తప్పుల్ని సరిద్దుకునే అవకాశం ఉండదు అని చెప్పిన దర్శకుడు.. రైటింగ్ స్థాయిలో అవి ఉంటాయని గ్రహించలేకపోయాడు. కథ రాస్తున్నప్పుడే.. దీనికి ఆడియన్స్ కనెక్ట్ అవుతారా, లేదా? అని చెక్ చేసుకుని, కాస్త వెనక్కి వెళ్లి.. చిన్నిపాటి మార్పులు చేసుకోవాల్సింది. ఓ మంచి ఆలోచనని.. గొప్ప సినిమాగా మలచలేకపోవడం కచ్చితంగా రైటింగ్ స్కిల్స్‌లోని లోపమే.
నటీనటులు
విజయ్ దేవరకొండ ఈసినిమాని తన భుజాలపై వేసుకుని నడిపించాడు. గౌతమ్‌గా తనలో అర్జున్ రెడ్డి పూనాడు. శీనయ్యగా మాత్రం కొత్తగా కనిపించాడు. తన అత్యంత సహజమైన ప్రతిభ శీనయ్య పాత్రలోనే కనిపించింది. పారిస్ ఎపిసోడ్‌లోనూ రొటీన్ దేవరకొండే కనిపిస్తాడు. నలుగురు హీరోయిన్లు ఉన్న సినిమా ఇది. స్పేస్ పరంగా చూస్తే రాశీఖన్నా ఎక్కువ సేపు కనిపిస్తుంది. ఏడవడం, డల్ ఫేస్‌తో కనిపించడం మినహా తాను ఏం చేయలేదు. బహుశా అదే గొప్ప నటన అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఐశ్వర్యా రాజేష్ మాత్రం.. చాలాబాగా నటించింది. తనని చూస్తున్నప్పుడల్లా జాలి, సానుభూతి కలుగుతాయి. తన నటన ఆ స్థాయిలో వుంది. తాను కనిపించే చివరి సన్నివేశంలో సైతం.. విజయ్‌ని డామినేట్ చేసేసింది. కేథరిన్, ఇజాబెల్లా.. వీరిద్దరి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
సాంకేతిక వర్గం
రైటర్‌గా తన స్కిల్స్ సంభాషణల్లో చూపించాడు క్రాంతి మాధవ్. కొన్ని చోట్ల పెన్ బాగా పనిచేసింది. `నేను రెగ్యులర్ ఇండియన్ కాదు` అని చెప్పడం బాగుంది. పెన్నూ, పేపరు గొప్పదనం బాగా వర్ణించాడు. అయితే మూడు ప్రేమకథల్నీ రొటీన్‌గానే రాసుకున్నాడు. అదే పెద్ద లోపం. పాటలు ఇంకాస్త బాగుండాల్సింది. కెమెరాపనితనం, నేపథ్య సంగీతం కూల్‌గా ఉన్నాయి. నిర్మాత కూడా బాగానే ఖర్చు పెట్టారు.
ఫినిషింగ్ టచ్: బోరింగు లవరు
తెలుగు360 రేటింగ్: 2.5/5